మార్క్సిజం అజరామరం

May 6,2024 01:03 #cpm, #Jayanti, #Karl Marx, #V.Srinivas rao
  •  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
  •  కారల్‌ మార్క్స్‌ జయంతి సందర్భంగా వామపక్షాలు, ప్రజాసంఘాల నివాళి

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మార్క్సిజం అజరామరమని, ప్రపంచవ్యాప్తంగా వర్గపోరాటాలు పెరుగుతున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. కమ్యూనిస్టు సిద్ధాంత కర్త, కార్ల్‌మార్క్స్‌ 206వ జయంతి సందర్భంగా ఆదివారం స్థానిక హనుమాన్‌ పేట కూడలి వద్ద ఉన్న మార్క్స్‌, ఏంగెల్స్‌ జంట విగ్రహాల వద్ద వామపక్ష పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ రెండు శతాబ్దాల క్రితం మార్క్స్‌ జన్మించి తన జీవితకాలంలో రూపొందించిన మహత్తర శాస్త్రీయ సిద్ధాంతమే కమ్యూనిజమని, అది సజీవంగా యావత్‌ ప్రజానీకాన్ని చైతన్యపరుస్తోంది, ఈ సిద్ధాంతానికి గుండెకాయ లాంటిది వర్గపోటం నేడు పెరుగుతోందని తెలిపారు.
పెట్టుబడిదారీ వ్యవస్థకు పెద్దన్న లాంటి అమెరికా తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దాడికి వ్యతిరేకంగా అమెరికాలోని పెద్దపెద్ద విశ్వవిద్యలయాల్లో విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారని అన్నారు. యూరోపియన్‌ దేశాల్లోనూ అనేక ప్రతిఘటనలు జరుగుతున్నాయని వివరించారు. పారిస్‌లో లాఠీఛార్జీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. కమ్యూనిజాన్ని సామ్రాజ్యవాదులు ఎంతగా పాతాళానికి తొక్కాలనుకుంటే అది అంతగా పైకి వస్తోందని, పునరుజ్వలన జరుగుతోందని తెలిపారు. శ్రామిక ప్రజల గుండెల్లో మార్క్స్‌ సజీవంగా ఉంటారని, ఆయన సిద్ధాంతం అజరామరమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో వస్తున్న మార్పు వర్గపోరాటం దిశగా ఉంటుందని అది దోపిడీ వ్యవస్థను అంతమొందిస్తుందని అన్నారు. మార్క్స్‌ సిద్ధాంతాల ప్రాతిపదికన సోవియట్‌ యూనియన్‌, చైనా, వియత్నాం, బ్రెజిల్‌ వంటి తూర్పు యూరప్‌ దేశాల్లో విప్లవాలు విజయవంతం అయ్యాయని, సామ్రాజ్యవాద దేశాలను గడగడ లాడించాయని పేర్కొన్నారు. సిపిఐ జాతీయ కౌన్సిల్‌ సభ్యులు అక్కినేని వనజ మాట్లాడుతూ నేడు ప్రపంచ దేశాలపై ఆధిపత్యం కోసం అమెరికా ఇతర దేశాలను రెచ్చగొడుతూ యుద్ధాలను చేయిస్తూ ఉందని అన్నారు. ఎఎన్‌యు విశ్రాంత ఆచార్యులు సి నరసింహారావు, జనసాహితి కార్యదర్శి దివికుమార్‌, ఐఎఫ్‌టియు నేత రవిచంద్ర మాట్లాడుతూ కారల్‌ మార్క్స్‌ మరణానంతరం ఆయన సాహిత్యానికి వ్యతిరేకంగా అనేక పుస్తకాలు రాసినప్పటికి అవేమీ నిలబడలేదన్నారు. ప్రపంచ పెట్టుబడిదారీ దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని, నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాసు, రాష్ట్ర కమిటీ సభ్యులు జె జయరాం, రైతు సంఘం నాయకులు వై.కేశవరావు, ప్రోగ్రెసివ్‌ ఫోరం ప్రతినిధి తాతారావు, ఇస్కఫ్‌ కార్యదర్శి అరుణకుమార్‌, సిపిఐ నాయకులు, వై చెంచయ్య పాల్గొన్నారు.

➡️