సుందరయ్య స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు

  • వర్థంతి సభల్లో వక్తలు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సిపిఎం అగ్రనేత పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో మరిన్ని ప్రజా ఉద్యమాలు నిర్మించడం, ప్రజా సమీకరణలు చేసి ప్రజలను చైతన్యం చేయడమే ఆయనకు అందించే ఘన నివాళని పలువురు వక్తలు పేర్కొన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్థంతి ఆదివారం ఉదయం సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. సుందరయ్య చిత్రపటానికి మాజీ ఎంపి పి.మధు పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పి.మధు మాట్లాడుతూ సుందరయ్య తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించడంతోపాటు ఎన్నో ఉద్యమాలు, పోరాటాల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. దళితులు, మహిళలకు న్యాయం చేయాలని, దేశానికి స్వాతంత్య్రం అవసరమని చిన్నతనంలోనే పోరాడారన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన జీవితాన్ని మననం చేసుకుని పునరంకితం అవ్వాలన్నారు. కమ్యూనిస్టు ఉద్యమ పురోగమనానికి పోరాటాలు, ఉద్యమాలే కీలమని, నిరంతరం శ్రమచేసే, సంపద సృష్టించే ప్రజల కోసం పనిచేయడం ద్వారానే పార్టీ ముందుకు పోతుందని సుందరయ్య చెప్పారన్నారు. ప్రస్తుతం దేశానికి బిజెపి రూపంలో పెనుప్రమాదం ముందుకు వచ్చిందని అన్నారు. వారు అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని తెలిపారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ దేశభక్తి, నిరాడంబరత, త్యాగం సుందరయ్య సొంతమన్నారు. ఆయన నిర్వహించిన పోరాటాలను లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాల్లో సుందరయ్య పాత్ర ఎనలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి, కె.సుబ్బరావమ్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.వి.నాగేశ్వరరావు, కె.ధనలక్ష్మి, కె.ఉమామహేశ్వరరావు, పి.మురళీకృష్ణ, డి.సుబ్బారావు, రైతు సంఘం సీనియర్‌ నాయకులు వై.కేశవరావు, వృత్తిదారుల సంఘం నాయకులు భాస్కరయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి అనిల్‌, నాయకులు హనీఫ్‌ విప్లవ గేయాలు ఆలపించారు.

ప్రజా సమీకరణ ద్వారానే మార్పు : సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్‌
ప్రజలను చైతన్యపర్చి పోరాటాల్లో సమీకరించడం ద్వారానే కమ్యూనిస్టు ఉద్యమం బలపడుతుందని, మార్పు వస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్‌ అన్నారు. వడ్డేశ్వరంలోని సుందరయ్య స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో సుందరయ్య చిత్రపటానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్‌, వి.వెంకటేశ్వర్లు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం తాడేపల్లి మండల కార్యదర్శి డి.వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో తులసీదాస్‌ మాట్లాడుతూ కమ్యూనిస్టుగా నిరాడంబర జీవితం గడిపిన సుందరయ్య ఆదర్శనీయులని అన్నారు. జాతీయోద్యమం సమయం నుండే ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలని నినాదం తీసుకుందని, దానికి అనుగుణంగా ప్రజలను కదిలించడంలో సుందరయ్య రాసిన విశాలాంధ్రలో ప్రజారాజ్యం పుస్తకం ఎంతో తోడ్పడిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పాలస్తీనాకు సంఘీభావంగా విద్యార్థి ఉద్యమాలు జరిగాయని, వామపక్షాలకు అనుకూల ఉద్యమాలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు, సిపిఎం మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థి జొన్నా శివశంకర్‌ మాట్లాడారు, తొలుత వక్తలను పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కె.హరికిషోర్‌ ఆహ్వనించారు.

నిత్య చైతన్య స్ఫూర్తి వ్యవసాయ కార్మిక సంఘం : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు
సుందరయ్య నిత్య చైతన్య స్ఫూర్తని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.సుబ్బారావు, వి.వెంకటేశ్వర్లు అన్నారు. వడ్డేశ్వరంలోని ప్రజా సంఘాల భవనంలో జరిగిన కార్యక్రమంలో సుందరయ్య చిత్రపటానికి వారు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతు కూలీలు, రైతాంగ ఉద్యమాల్లో సుందరయ్య చేసిన కృషి మరువలేనిదని తెలిపారు.

➡️