మిమ్స్‌, ఆంధ్రా పేపర్‌ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు

Apr 4,2024 15:21 #CPIM, #CPM State Committee
  • సిపిఎం రాష్ట్ర కమిటీ తీర్మానం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మిమ్స్‌, ఆంధ్రా పేపర్‌ లిమిటెడ్‌ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెకు సిపిఎం రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలని కోరింది. గురువారం ఉదయం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశం ఈ మేరకు తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. విజయనగరం జిల్లాలో 300 మంది మిమ్స్‌ కార్మికులు 64 రోజులు, రాజమండ్రిలో ఆంధ్రపేపర్‌ లిమిటెడ్‌లో 2,500 మంది కార్మికులు మూడు రోజులుగా సమ్మె చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరింది. యాజమాన్యం మొండివైఖరివల్లే ఈ రెండుచోట్లా కార్మికుల నిరవధిక సమ్మెలు సాగుతున్నాయని పేర్కొంది. ఆంధ్రపేపర్‌ లిమిటెడ్‌లో నాలుగేళ్ల నుండి వేతన ఒప్పందాలు చేయకుండా యాజమాన్యం కాలయాపన చేస్తోందని తెలిపారు. గత ఆరేళ్లుగా ప్రతి సంవత్సరం సుమారు రూ.200 కోట్ల నికరలాభం ఈ సంస్థ ఆర్జించిందని పేర్కొన్నారు. యూనియన్‌కు ఎన్నికలు జరగకుండా కోర్టులను అడ్డుపెట్టుకుని నాటకాలు ఆడుతోందని, సీనియర్‌ కార్మికులను తొలగించి కొత్త కార్మికులను నియమించి తక్కువ జీతాలు ఇస్తోందని, పనిభారం పెంచిందని తెలిపారు. పర్మినెంటు, కాంట్రాక్టు కార్మికులందరూ మూడు రోజుల నుండి కంపెనీలోనే బైఠాయించారని, సమస్యను పరిష్కరిస్తేనే సమ్మెను విరమిస్తామని పట్టుదలగా ఉన్నారని పేర్కొన్నారు. గతంలో ఎన్నిసార్లు యూనియన్లు ప్రయత్నించినా చర్చలు జరపకుండా యాజమాన్యం మొండివైఖరి ప్రదర్శించిందని, గత్యంతరం లేక కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారని పేర్కొన్నారు. మిమ్స్‌ యాజమాన్యం కార్మిక సంఘాలు ఉండకూడదని, బయట నాయకులను అనుమతించబోమని చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోందని తెలిపారు. కార్మికులంతా సిఐటియు యూనియన్లోనే ఉన్నా సిఐటియు బయట నాయకులతో మాట్లాడనని చెప్పడం టియు చట్టాన్ని ధిక్కరించడమేనని, యాజమాన్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలని తీర్మానంలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా యాజమాన్యంపై చర్యలు తీసుకోకుండా నిరవధిక సమ్మెను నిషేధించిందని, చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న యాజమాన్యం కొమ్ముకాయడం దుర్మార్గమని పేర్కొంది. కార్మికులకు 2019వ సంవత్సరం నుండి వేతన ఒప్పందాలు చేయకుండా మొండివైఖరి ప్రదర్శిస్తోందని, ఏడు దఫాలుగా కరువుభత్యం కూడా చెల్లించలేదని పేర్కొంది. కార్మికుల ఆందోళన తీవ్రతరం అయిన తరువాత యాజమాన్యం చర్చలు సాగిస్తున్నాయని, అయినా 2024 ఆగస్టు నుండి మాత్రమే వేతన ఒప్పందం చేస్తామని, అక్టోబరు 2024 నుండి మాత్రమే కరువు భత్యం చెల్లిస్తామని యాజమాన్యం ప్రతిపాదించిందని, దీన్ని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు వైఖరిని సిపిఎం తీవ్రంగా ఖండించింది.

➡️