మిమ్స్‌ ఉద్యోగుల ఆందోళన

Mar 26,2024 21:35 #Dharna, #Mims employees, #vijayanagaram

– సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌ వద్ద ధర్నా
ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :బకాయి ఉన్న ఏడు డిఎలు ఇవ్వాలని, వేతన ఒప్పందాన్ని అమలు చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ విజయనగరం కలెక్టరేట్‌ వద్ద మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు ధర్నా చేశారు. యాజమాన్యం మొండివైఖరిని నిరసిస్తూ కలెక్టరేట్‌ ఎదుట ఎన్‌టిఆర్‌ విగ్రహం వద్ద అంతకుముందు మానవహారం నిర్వహించారు. మిమ్స్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఈ కార్యక్రమం చేపట్టారు. మిమ్స్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షులు టివి. రమణ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె. సురేష్‌ మాట్లాడారు. మిమ్స్‌ యాజమాన్యం జిల్లా అధికార యంత్రాంగాన్ని, లేబర్‌ అధికారులను, పోలీసులను తప్పుదారి పట్టిస్తోందన్నారు. రెండోవైపు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సస్పెండ్లు, వేధింపులు ఆపాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని, తదితర డిమాండ్లతో 55 రోజులుగా ఉద్యోగులు అనేక రూపాల్లో ఆందోళనలు చేస్తున్నా యాజమాన్యం గాని, అధికారులు గాని పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందించిన ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం యాజమాన్యానికి తగునా? అని ప్రశ్నించారు. సమస్యలు పరిష్కారం కోసం వెంటనే చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ ప్రధాన కార్యదర్శి ఎం.నారాయణరావు, ఉద్యోగులు కామునాయుడు, అప్పలనాయుడు, నాగభూషణం, నర్సింగ్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️