సభలకు వచ్చే ప్రజలను కూలీలనడం తగదు :  మంత్రి మేరుగ నాగార్జున

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపి సభలకు ప్రజలు తరలి వస్తుండటంతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేక వారిని కూలీలు అని అవమానించడం తగదని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసిపి సభలకు వచ్చే ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలు కూలీ జనం అయితే, టిడిపి సభలకు వచ్చే వారు పెత్తందారులా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో దళితులు, బిసిలను ఓటు అడిగే హక్కును చంద్రబాబు కోల్పోయారని అన్నారు. కూటమి కుట్రలను రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టనున్నారని పేర్కొన్నారు.

ఓర్వలేకే దుష్ప్రచారం : సుధాకర్‌బాబు
జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పేద ప్రజలకు రూ 2.75 లక్షల కోట్లను నేరుగా ప్రజలకు అందిస్తుంటే టిడిపి ఓర్వలేక సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసి ఏర్పాటుచేసి దుష్ప్రచారం చేయిస్తోందని వైసిపి ఎమ్మెల్యే టిజెఆర్‌ సుధాకర్‌బాబు విమర్శించారు. చంద్రబాబు అధికారంలో వుంటే తమ అక్రమాలు బయటకు రావనే వారంతా జగన్‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. పదవిలో వున్నపుడు ఐఎఎస్‌ అధికారిగా పివి రమేష్‌ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

➡️