ఎమ్మెల్సీ సాబ్జీ ఇకలేరు

Dec 16,2023 08:21 #died, #PDF MLC
  • ఉండి మండలం చెరకువాడలో ఘటన
  • అగన్‌వాడీల దీక్షలకు మద్దతు తెలిపి ఆశా వర్కర్ల వద్దకు వెళ్తుండగా ప్రమాదం
  • నివాళులర్పించిన రాజకీయ ప్రముఖులు, జిల్లా అధికారులు

ప్రజాశక్తి- భీమవరం, ఉండి: ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ (57) శుక్రవారం మధ్యాహ్నం ఉండి మండలం చెరుకువాడ గ్రామం వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శుక్రవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఏలూరు నుంచి కారులో తన పిఎ అలీ, గన్‌మెన్‌ ఎస్‌.ముత్యాలరావుతో కలిసి భీమవరం బయల్దేరారు. మార్గమధ్యంలో ఏలూరు జిల్లా కైకలూరు, పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో అంగన్‌వాడీల సమ్మె శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలిపారు. అక్కడ నుంచి భీమవరంలో కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేస్తున్న ఆశాలకు సంఘీభావం తెలిపేందుకు భీమవరం బయల్దేరారు. ఉండి మండలం చెరుకువాడ వద్ద భీమవరం నుంచి ఆకివీడు వైపు వెళ్తున్న కారు సాబ్జీ కారును ఎదురుగా బలంగా ఢీ కొంది. ఈ ప్రమాదంలో సాబ్జీ… నుదుటి భాగంలో బలమైన గాయం కావడం, ఛాతిపైనా బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన పిఎ అలీకి తీవ్ర గాయాలయ్యాయి. కారు నడుపుతున్న శ్రీనివాసరావు, గన్‌మెన్‌ కూడా గాయపడ్డారు. ప్రమాదానికి కారణమైన కారులో ఎయిర్‌ బెలూన్లు తెరుచుకోవడంతో ఆ కారులోని వారికి గాయాలవ్వలేదు. వారు అక్కడి నుంచి పరారయ్యారు. గాయాలైన వారిని భీమవరంలోని ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించారు. సాబ్జీ భౌతికకాయాన్ని భీమవరం ప్రభుత్వాస్పత్రికి తరలించి సాయంత్రం వరకూ సందర్శన నిమిత్తం అక్కడే ఉంచారు. ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు (ఐవి), యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి… యుటిఎఫ్‌ పతాకాన్ని ఎంఎల్‌సి సాబ్జీ భౌతికకాయంపై ఉంచి నివాళులర్పించారు. జిల్లా ఎస్‌పి యు.రవిప్రకాష్‌ అక్కడకు చేరుకుని పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు, కార్మికులు పెద్ద సంఖ్యలో ప్రభుత్వాస్పత్రికి తరలచ్చారు. శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు, జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి, జిల్లా ఎస్‌పి యు.రవిప్రకాష్‌, జాయింట్‌ కలెక్టర్‌ రామ్‌సుందర్‌రెడ్డి, భీమవరం ఆర్‌డిఒ శ్రీనివాసులురాజు, డిఇఒ ఆర్‌.వెంకటరమణ, డిఎం అండ్‌ హెచ్‌ఒ మహేశ్వరరావు సాబ్జీ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిపిఎం పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లా కార్యదర్శులు బి.బలరాం, ఎ.రవి, యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి, సిఐటియు పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జెఎన్‌వి.గోపాలన్‌, కె.రాజారామ్మోహన్‌రారు, ఆర్‌.లింగరాజు, డిఎన్‌విడి.ప్రసాద్‌, యుటిఎఫ్‌ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పిఎస్‌.విజయరామరాజు, ఎకెవి.రామభద్రం, సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు తదితరులు నివాళులర్పించారు. భౌతికకాయం వద్ద సాబ్జీ భార్య షేక్‌ షబానీ బేగం, కుమారుడు ఆజాద్‌, సోదరి జెరినా, బావ సుభాని కన్నీరుమున్నీరుగా విలపించారు.

తలకు బలమైన గాయం : జిల్లా ఎస్‌పి రవి ప్రకాష్‌ ఎంఎల్‌సి సాబ్జీ మృతి బాధాకరమని జిల్లా ఎస్‌పి యు.రవిప్రకాష్‌ అన్నారు. సాబ్జీ భౌతికకాయాన్ని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఎంఎల్‌సి కారు ప్రమాదానికి గురైందన్నారు. ఎదురుగా వస్తున్న మరొక కారు సాబ్జీ కారును బలంగా ఢీ కొందని, ప్రమాదంలో సాబ్జీ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు.

నా తండ్రి మృతిపై అనుమానాలున్నాయి

సాబ్జీ కుమారుడు ఆజాద్‌ తన తండ్రి మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని, సిబిసిఐడి ద్వారా విచారణ జరిపించాలని ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ కుమారుడు ఆజాద్‌ కోరారు. సాబ్జీ మృతిపై అనుమానాలున్నాయంటూ ఆయన సోదరుడు ఫరీద్‌ ఖాసిన్‌ శుక్రవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం సాబ్జీ కుమారుడు ఆజాద్‌ మీడియాతో మాట్లాడారు. తన తండ్రి ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న కారు 140 కిలోమీటర్ల వేగంతో వచ్చి ఢీ కొందని తెలిపారు. దీనిపై అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. కుమార్తె అమెరికా నుంచి వచ్చాక ఏలూరులో అంత్యక్రియలుసాబ్జీ భౌతికకాయానికి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి చేసి శుక్రవారం రాత్రి ఏలూరులోని ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. సాబ్జీ కుమార్తె అస్రిఫ్‌ అమెరికాలో ఉన్నారు. ఆమె ఆదివారం ఏలూరు చేరుకునే అవకాశం ఉంది. ఆమె వచ్చిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

➡️