మోడీ, జగన్‌, బాబు మోసకారీ

  •  ఎన్నికల్లో ఆ ముగ్గురిని ఓడించాలి
  •  ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలి : బేబి

ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి : ప్రజలను మోసం చేయడంలో మోడీ, జగన్‌, బాబు పోటీ పడుతున్నారని, ఎన్నికల్లో ఆ ముగ్గురిని ఓడించాలని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ బేబి కోరారు. ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం కల్లూరు చెన్నమ్మ సర్కిల్‌ వద్ద సోమవారం సాయంత్రం సిపిఎం న్యూ సిటీ కార్యదర్శి టి.రాముడు అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో బేబి మాట్లాడుతూ… ఎన్నికలకు ముందు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన మోడీ.. రైతు వ్యతిరేక విధానాల వల్ల ఆత్మహత్యలు రెట్టింపు అయ్యాయని చెప్పారు. అలాంటి మోడీతో జతకట్టడం కోసం జగన్‌, చంద్రబాబు పోటీ పడుతున్నారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో దేశంలో మోడీని రాష్ట్రంలో జగన్‌ని గద్దె దించడం మన కర్తవ్యమని, ఇండియా వేదికకు ఓటు వేయడం ద్వారానే అది సాధ్యమని తెలిపారు. భవిష్యత్తులో ముస్లింలు, క్రైస్తవులు ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణింపబడతారని తెలిపారు. చౌకీదార్‌ అని చెప్పుకునే మోడీ ఎన్నికల బాండ్ల పేరుతో వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారని విమర్శించారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్‌ మాట్లాడుతూ.. అబద్ధాలు చెప్పడంలో బాబు, జగన్‌ పోటీ పడుతున్నారని విమర్శించారు. ప్రజల ఆస్తులను కారుచౌకగా పెట్టుబడిదారుల పరం చేస్తున్నారని, అదే బిజెపి వికాసమని చెప్పారు. కరోనాను ఎదుర్కోవడంలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ప్రజలను విభజించే దుర్మార్గులను దేశం నుంచి తరిమికొడితేనే దేశం బాగుపడుతుందని చెప్పారు. 2018లో బిజెపికి వ్యతిరేకంగా చంద్రబాబు మాట్లాడి ఇప్పుడు అదే పార్టీతో జతకట్టారని విమర్శించారు. జైలుకు పోయే వాళ్ళందరూ మోడీతో జత కడుతున్నారని ఎద్దేవా చేశారు. సిపిఐ రాష్ట్ర నాయకులు జగన్నాథం మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు చాలా ప్రాముఖ్యమైనవన్నారు. మోడీ పదేళ్ల పాలనలో, జగన్‌ ఐదేళ్ల పాలనలో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా? అని ప్రశ్నించారు. మోడీతో జతకట్టిన చంద్రబాబు కూటమిని, నియంతృత్వ వైసిపిని ఓడించాలని, ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌ ఎంపి అభ్యర్థి జె.లక్ష్మినరసింహయాదవ్‌ మాట్లాడుతూ…బిజెపి పదేళ్ల పాలనలో రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను విస్మరించారన్నారు. భూ కబ్జాదారుడైన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డిని ఈ ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని కోరారు. సిపిఎం పాణ్యం అసెంబ్లీ అభ్యర్థి డి.గౌస్‌ దేశారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.ప్రభాకర్‌ రెడ్డి, రాంభూపాల్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు పి.నిర్మల, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పిఎస్‌ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️