మోడీ కాళ్లు మొక్కే పార్టీలను సాగనంపాలి

Apr 30,2024 01:16 #cpm, #vadde sobhanadeeswararao
  •  చైతన్య యాత్రలో వడ్డే శోభనాద్రీశ్వరరావు, చలసాని శ్రీనివాసరావు

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో/మల్కాపురం : మోడీ కాళ్లు మొక్కే పార్టీలైన టిడిపి, వైసిపి, జనసేనలను సాగనంపాలని భారత రాజ్యాంగ హక్కుల వేదిక కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు, ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు కోరారు. ఎపి చైతన్య యాత్రలో భాగంగా విశాఖలోని మల్కాపురంలో సోమవారం జరిగిన సభలో వారు మాట్లాడారు. ఇండియా వేదిక తరఫున పోటీ చేస్తున్న సిపిఎం గాజువాక అభ్యర్థి జగ్గునాయుడును, సిపిఐ విశాఖ పశ్చిమ అభ్యర్థి విమలను, కాంగ్రెస్‌ పార్టీ విశాఖ ఎంపి అభ్యర్థి సత్యారెడ్డిని గెలిపించాలని కోరారు. స్టీల్‌ప్లాంట్‌ను గుజరాతీయులకు అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడుతుంటే, నీతి, నిజాయితీ, నిబద్ధతతో దాన్ని ఆపేందుకు కమ్యూనిస్టు పార్టీ నాయకులు పోరాడుతున్నారని వివరించారు. జగ్గునాయుడు, విమల వంటి పోరాడే నాయకులు కావాలో, మోడీ కాళ్ల దగ్గర కూర్చున్న నాయకులు కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఎంతోమంది విశాఖ వచ్చి స్థిరపడడానికి స్టీల్‌ప్లాంట్‌, హెచ్‌పిసిఎల్‌, బిహెచ్‌పివి, పోర్టు, షిప్‌యార్డ్‌ వంటి ప్రభుత్వరంగ సంస్థలు ఉండడమే కారణమని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమ్మకానికి పెట్టిందని, మిగిలిన ప్రభుత్వ రంగ సంస్థలనూ అదానీ, అంబానీలకు అమ్మేందుకు సిద్ధపడుతోందని అన్నారు. ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణకు, ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాడుతున్న వారికి ఈ ఎన్నికల్లో పట్టం కట్టాలని కోరారు. ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచీ సిపిఎం, సిపిఐ మాత్రమే పోరాడుతున్నాయని గుర్తు చేశారు. మోడీ మళ్లీ అధికారంలోకొస్తే భవిష్యత్తులో ఎన్నికలు జరిగే పరిస్థితి ఉండదన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు గతంలో స్టీల్‌ప్లాంట్‌పై ప్రగల్బాలు పలికాయని, ఆ పార్టీల నాయకులు నేడు మోడీకి దాసోహం అయ్యారని విమర్శించారు.

బిజెపిని, దాని అనుకూల పార్టీలను ఓడించాలి
బిజెపిని, దానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న పార్టీలను ఈ ఎన్నికల్లో ఓడించాలని వడ్డే శోభనాదీశ్వరరావు కోరారు. గాజువాకలోని ఎస్‌బిటి హోటల్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిజెపి మళ్లీ గెలిస్తే రాజ్యాంగానికి తీవ్ర హాని తలపెడుతుందన్నారు. గడిచిన పదేళ్లలో విభజన చట్టంలోని ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోను ఏర్పాటు అమలు కాలేదని తెలిపారు. ఇండియా వేదిక అధికారంలోకొస్తే ఇవన్నీ సాధ్యమవుతాయని చెప్పారు. విలేకర్ల సమావేశంలో రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక కన్వీనర్‌ కె.విజయరావు పాల్గొన్నారు.

➡️