జనసేన మూసేస్తే మంచిది : ముద్రగడ

Apr 12,2024 00:10 #coments, #JanaSena, #Mudragada

ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి) : జనసేన పార్టీని మూసివేసి.. సినిమాలు చేసుకుంటే బాగుంటుందని పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి కాపు ఉద్యమ నేత, వైసిపి రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విమర్శించారు. కాపు యువత జీవితాలతో ఆడుకోవద్దని, ఆ 20 సీట్లు కూడా వెనక్కి ఇచ్చేసి పార్టీని విలీనం చేసి షూటింగులకు వెళితే బాగుంటుందన్నారు. కొంతమంది తనను తెరచాటు నుంచి సపోర్టు చేయొచ్చు కదా అని అడిగారని, తాను పవన్‌కు ఎందుకు సపోర్టు చేయాలని ప్రశ్నించారు. తాడేపల్లిగూడెం మాగంటి ఫంక్షన్‌ హాల్లో గురువారం జరిగిన కాపు ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ.. జగన్‌ ప్రకటించిన అభ్యర్థులను బలపర్చాలని, వారి విజయానికి సహకరించాలని కోరారు. 2014లో అధికార దాహంతో ఉన్న చంద్రబాబు ఆ దాహం తీర్చుకోవడానికి కాపు, తెలగ, బలిజలకు రిజర్వేషన్లు పునరుద్ధరిస్తానని మోసగించారన్నారు. ఇచ్చిన హామీని అమలు చేయమంటే తనకు, తన కుటుంబాన్ని అవమానాలకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఐదేళ్లు చంద్రబాబు పక్కనే ఉన్న పవన్‌ కల్యాణ్‌ ఏనాడైనా ముద్రగడను ఎందుకు అవమానించారని చంద్రబాబును అడిగారా? అని ప్రశ్నించారు. పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకునే వారని, చంద్రబాబు మాత్రం లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి యువగళం పాదయాత్ర పెట్టించారన్నారు. అడిగిన సీట్లు ఇవ్వకుండా, పవర్‌ షేరింగ్‌ లేకుండా కేవలం 21 సీట్లకు పవన్‌ కల్యాణ్‌ పరిమితం అయిపోవడం దారుణమన్నారు.

➡️