మున్సిపల్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలి

Dec 11,2023 22:34 #CH Narsingrao, #CITU
  •  అప్పటి వరకు రాజీలేని పోరాటం
  • ధర్నాలో సిఐటియు ప్రధాన కార్యదర్శి నర్సింగరావు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మున్సిపాల్టీలతో పాటు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేసే వరకూ రాజీలేని పోరాటం నిర్వహిస్తామని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు అన్నారు. ఇచ్చిన వాగ్దానాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. జగనన్న హామీల అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ రిలే నిరాహార దీక్షలు సోమవారం విజయవాడలోని ధర్నాచౌక్‌లో ప్రారంభమయ్యాయి. ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ దీక్షలను నర్సింగరావు ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికవర్గ హక్కులను కాలరాస్తూ కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలుగా నిలిచాయని విమర్శించారు. రోడ్లను శుభ్రంగా తయారుచేసే మున్సిపల్‌ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేసి రెగ్యులరైజ్‌ చేస్తానని ప్రతిపక్షనేతగా జగన్‌ వాగ్దానం చేశారని, ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. ఇంజినీరింగ్‌ కార్మికులకు రిస్క్‌, హెల్త్‌ అలవెన్సులు, కార్మికులందరికీ సంక్షేమ పథకాలు, జిఓ 30ను సవరించి కార్మికశాఖ ప్రతిపాదనల వంటి హామీలను అమలు చేస్తామని మున్సిపల్‌శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి జూన్‌లో జరిగిన చర్చల సందర్భంగా హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పటి వరకు వీటిని అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 21 నుంచి నిరవధిక సమ్మెకు కార్మికులు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకులు ఎన్‌సిహెచ్‌ శ్రీనివాస్‌, జి ఓబులు, ముజఫర్‌ అహ్మద్‌, కె ధనలక్ష్మి, మున్సిపల్‌ ఫెడరేషన్‌ కోశాధికారి ఎస్‌ జ్యోతిబసు తదితరులు పాల్గొని ప్రసంగించారు.

➡️