ఆర్‌జివి హత్యకు టిడిపి కుట్ర : పోసాని మురళీకృష్ణ

Apr 22,2024 22:57 #coments, #Posani Krishna Murali, #rgv

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ హత్యకు టిడిపి కుట్ర పన్నిందని ఎపి ఎఫ్‌డిసి ఛైర్మన్‌ పోసాని మురళీకృష్ణ ఆరోపించారు. రామ్‌గోపాల్‌ వర్మ హత్యకు చంద్రబాబు నో చెప్పడంతో ఆగిపోయిందని అన్నారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడలో జగన్‌ను అంతమొందించేందుకు టిడిపి కుట్ర పన్నిందని, దీనివెనుక చంద్రబాబు హస్తం వుందని అన్నారు. మహాటీవి అనిల్‌, కిలారు రాజేష్‌, నారా లోకేష్‌ కలిసి ఆర్‌జివి హత్యకు కుట్ర చేస్తే చివరి నిమిషంలో చంద్రబాబు నో చెప్పడంతో ఆగిపోయిందని విమర్శించారు. ఈ అంశాన్ని కిలారు రాజేష్‌, కిలారు మనుషులే తనతో చెప్పారని అన్నారు. ఈ అంశంపై పోలీసుల విచారణ జరగాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ ప్రజల కోసం పార్టీ పెడితే, మెగా ఫ్యామిలీ పైసల కోసం పార్టీలు పెట్టాయని విమర్శించారు.
ప్రతి ఎన్‌ఆర్‌ఐ కనీసంగా వేయి ఓట్లను కొనుగోలు చేయాలని టిడిపి ఎన్‌ఆర్‌ఐ విభాగం నాయకులు కోమటి జయరామ్‌ చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తానా మాజీ ఛైర్మన్‌ యార్లగడ్డ వెంకట రమణ డిమాండ్‌ చేశారు. బ్రాహ్మణ సంక్షేమానికి వైసిపి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. నవరత్నాలపై దుష్ప్రచారం తగదని వనరత్నాల అమలు కమిటీ వైస్‌ ఛైర్మన్‌ నారాయణ మూర్తి అన్నారు. సిఎం జగన్‌పై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ భాషను మార్చుకోవాలని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.

➡️