నెల్లూరు భారీగా మద్యం పట్టివేత

Apr 21,2024 22:18 #illegal liquor, #Nellor, #sizedd
  •  సచివాలయంలో దాచిన మద్యం నిల్వలు

ప్రజాశక్తి – యంత్రాంగం : నెల్లూరు జిల్లాలో ఆదివారం భారీగా మద్యం పట్టుబడింది. మూడు కార్లలో తరలిస్తున్న మద్యాన్ని, సచివాలయంలో నిల్వ చేసిన మద్యం, బియ్యం బస్తాలను స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో, ఎలక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సెబ్‌ అధికారుల ఇచ్చిన ప్రకటన మేరకు.. నెల్లూరు అడిషనల్‌ ఎస్‌పి (సెబ్‌) ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్‌ వింగ్‌, నెల్లూరు ఇందుకూరుపేట ఎస్‌ఇబి అధికారులు ముత్తుకూరు మండలం, పంటపాలెం గ్రామంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మూడు కార్లలో తరలిస్తున్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తెలంగాణ రాష్ట్రం కె. వి రంగారెడ్డి ప్రాంతానికి చెందిన మారు సుధాకర్‌ రెడ్డి, బేగంపేటకు చెందిన చిలక రాము, అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం బోడపాలెం గ్రామానికి చెందిన లోకవరపు వెంకట రమణ, ముత్తుకూరు మండలం పంటపాలెం ఈపూరు గ్రామానికి చెందిన పుచ్చకాయల నాగేశ్వరావులను అరెస్టు చేశారు. అక్రమం మద్యం ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు? ఎవరి హస్తం ఉందనే వివరాలు తెలియాల్సి ఉంది.
కావలి పట్టణం బుడమగుంట సచివాలయంలో మద్యం నిల్వ చేస్తున్నారని ‘సి’ విజిల్‌ యాప్‌లో స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఎలక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు, ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు గ్రామ సచివాలయం తాళాలు పగులకొట్టి, తనిఖీ చేశారు. 43 మద్యం సీసాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు ఎనిమిది బస్తాల ప్రజాపంపిణీ వ్యవస్థకు చెందిన బియ్యాన్ని కూడా స్వాధీనం పర్చుకున్నారు.
రూ.4,60,880ల విలువైన వెండి సీజ్‌
ఎన్నికల తనిఖీల్లో భాగంగా గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం పరిధిలో రూ.4,60,880లు విలువ గల 6,584 గ్రామాల వెండిని ఎన్నికల అధికారులు సీజ్‌ చేశారు. జిల్లాలో ఇప్పటి వరకూ రూ.2,31,26,840ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను సీజ్‌ చేశారు.

➡️