కులం, మతం చెప్పక్కర్లేదు : అన్ని కోర్టులకూ హైకోర్టు సర్క్యులర్‌

ప్రజాశక్తి-అమరావతి : కక్షిదారులు తమ కుల, మతాలను చెప్పాల్సిన అవసరం లేదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని కోర్టులకూ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ వై లక్ష్మణరావు పేరిట సర్క్యులర్‌ జారీ అయ్యింది. కక్షిదారులు తమ పిటిషన్లలో కులం, మతం గురించి వివరించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ మేరకు అన్ని కోర్టులు తగిన చర్యలు తీసుకోవాలంది. ఇతర ప్రొసీడింగ్స్‌ ఎక్కడా కూడా తమ కులాన్ని, మతాన్ని పొందుపరచాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ విషయాన్ని అన్ని న్యాయవాద సంఘాలు పరిగణనలోకి తీసుకుని విధిగా అమలు చేయాలంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అన్ని కోర్టులూ కచ్ఛితంగా పాటించాలంది. షామా శర్మ వర్సెస్‌ కిషన్‌ కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని స్పష్టం చేసింది.

➡️