ప్రజలెవ్వరూ ఈనెల కరెంటు బిల్లులను కట్టొద్దు : కెటిఆర్‌

Jan 20,2024 14:05 #electricity bills, #KTR, #speech

తెలంగాణ : లండన్‌లో సిఎం రేవంత్‌ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలపై బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్‌ స్పందించారు. బిఆర్‌ఎస్‌ను 100 మీటర్లలోపల పాతిపెట్టడం కాదు.. ముందు 100 రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలను నెరవేర్చండి.. జనవరి నెల కరెంటు బిల్లులను ప్రజలెవరూ చెల్లించవద్దు.. అని తెలంగాణ ప్రజలకు కెటిఆర్‌ పిలుపునిచ్చారు.

సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల సన్నాహక సమావేశంలో ప్రసంగించిన కెటిఆర్‌.. సిఎం రేవంత్‌ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. లండన్‌లో బిఆర్‌ఎస్‌ పార్టీపై రేవంత్‌ చేసిన కామెంట్లపై స్పందిస్తూ … ఎన్నికల సందర్భంగా … కాంగ్రెస్‌ ఇచ్చిన ఉచిత విద్యుత్తు పథకమైన గృహజ్యోతి హామీని నెరవేర్చే వరకూ ఎవ్వరూ బిల్లులు కట్టొద్దని చెప్పారు. ఒకవేళ అధికారులు బిల్లులు కట్టాలని ఒత్తిడి చేస్తే.. ముఖ్యమంత్రి మాటలను చూపించాలన్నారు. రేవంత్‌ వంటివారిని బిఆర్‌ఎస్‌ తన ప్రస్థానంలో ఎంతో మందిని చూసిందని అన్నారు. 25 ఏళ్లుగా నిలబడి, అలాంటి వాళ్లను ఎందరినో మట్టికరిపించిందని చెప్పారు. బిఆర్‌ఎస్‌ను 100 మీ.లోపల పాతిపెట్టడం కాదు.. ముందు 100 రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలను నెరవేర్చాలని కోరారు. జనవరి నెల కరెంటు బిల్లులను ప్రజలెవరూ చెల్లించవద్దు అని, కరెంటు బిల్లులను 10 జన్‌పథ్‌లోని సోనియా గాంధీ ఇంటికి పంపాలని చెప్పారు. హైదరాబాద్‌ నగరంలో ఉన్న ప్రతి ఒక్క మీటర్‌కి గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్‌ అందించాలన్నారు. గృహ జ్యోతి కార్యక్రమాన్ని వెంటనే అమలు చేయాలన్నారు. ఇందులో కిరాయి ఇండ్లలో ఉండే వాళ్ళకి కూడా ఉచిత విద్యుత్‌ ఇవ్వాలన్నారు. మహాలక్ష్మి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క మహిళకు రూ.2,500 వెంటనే ఇవ్వాలన్నారు. ఇచ్చిన హామీలను తప్పించుకోవడానికి కాంగ్రెస్‌ చూస్తే వదిలిపెట్టే పరిస్థితి లేదు అని కెటిఆర్‌ స్పష్టం చేశారు.

➡️