6న గాజు గ్లాసు వివాదంపై విచారణ

May 2,2024 23:24 #AP High Court, #JanaSena

ప్రజాశక్తి-అమరావతి : జనసేన ఎన్నికల చిహ్నం గాజు గ్లాసును ఆ పార్టీ పోటీ ప్రభావం లేని చోట్ల ఆ చిహ్నాన్ని ఫ్రీ సింబల్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ టిడిపి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ ఈ నెల 6వ తేదీకి వాయిదా పడింది. బుధవారమే బ్యాలెట్ల ముద్రణ ప్రారంభమైందని, ఇప్పటికే భద్రతా దళాలకు ఎలక్ట్రానిక్‌ బ్యాలెట్లు పంపామని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్‌ న్యాయవాది అవినాష్‌ దేశారు చెప్పారు. ఎన్నికల ప్రక్రియ మొదలైన దశలో కోర్టు జోక్యం చేసుకుంటే ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలుగుతుందని చెప్పారు. రాజ్యాంగంలోని 329(బి) అధికరణం ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడ్డాక కోర్టులు జోక్యానికి వీల్లేదన్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు కొంత గడువు కావాలని పిటిషనర్‌ తరఫున సీనియర్‌ అడ్వకేట్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ కోరారు. దీంతో విచారణను ఈ నెల 6కు వాయిదా వేస్తూ జస్టిస్‌ బి కృష్ణమోహన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా పోటీ చేస్తున్నాయని, జనసేన పోటీ ప్రభావం లేని నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు, గుర్తింపు లేని పార్టీల అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తే కూటమి అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతుందని టిడిపి జనరల్‌ సెక్రెటరీ వర్ల రామయ్య పిటిషన్‌లో పేర్కొన్నారు.

➡️