రేపటి నుంచే నామినేషన్లు ..ఐదుగురికి మాత్రమే అనుమతి : ఢిల్లీరావు

Apr 17,2024 11:43 #collecter delhi rao, #press meet

అమరావతి: రేపటి నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావు పేర్కొన్నారు. 18 నుంచి 25 లోపు నామినేషన్లు తీసుకోనున్నామన్నారు. రేపు సెక్షన్‌ 30, 31 నోటీసు ఇస్తామన్నారు. ఫారం-1 పబ్లిక్‌ నోటీసుపై రిటర్నింగ్‌ అధికారి సంతకం చేస్తారని.. రేపు ఉదయం 11 గంటల నుంచీ నామినేషన్లు స్వీకరించడానికి సంసిద్ధం చేసుకుంటారన్నారు. నామినేషన్లు వేసే దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతీ ఒక్కరికీ క్యాండిడేట్‌ కిట్‌ ఇస్తున్నామని తెలిపారు. నామినేషన్‌ సమయంలో ఐదుగురికి మాత్రమే అభ్యర్ధితో పాటు అనుమతి ఇస్తామన్నారు. నామినేషన్ల స్క్రూటినీ 26న జరుగుతుందని.. అర్హత కలిగిన నామినేషన్ల జాబితా అదేరోజు ఇస్తామన్నారు.
నామినేషన్లు ఉపసంహరణకు అభ్యర్ధి లేదా అతని ప్రతినిధి రావచ్చన్నారు. కలెక్టర్‌ ఢిల్లీ రావు మాట్లాడుతూ.. ”నామినేషన్ల ఉపసంహరణ 26న, 29న జరుగుతాయి.. 27, 28 శని ఆది వారాలు కావడంతో 29న సింబల్‌ ఇవ్వడం జరుగుతుంది.. పోటీ చేసే అభ్యర్ధుల ఫారం 7ఎ, 29న ఇవ్వనున్నామన్నారు. మే 2 నుంచీ ఈవీఎంల కమిషనింగ్‌ జరుగుతుంది. వృద్ధులు, వికలాంగుల హోం ఓటింగ్‌ కు 25, 26 తేదీల్లో ఏర్పాట్లు చేస్తున్నాం. మొత్తం ఎన్టీఆర్‌ జిల్లాలో 1792 పోలింగ్‌ స్టేషన్లు ఉంటాయి.. గన్నవరం 82 పోలింగ్‌ స్టేషన్లు కూడా ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలోకి వస్తాయి. పార్లమెంటుకు 2ఏ, అసెంబ్లీకి 2బీ నామినేషన్‌ ఫారంలు ఉంటాయి. బ్యాంకు అకౌంట్‌ కూడా ప్రత్యేకంగా ఎన్నికల కోసమే ఓపెన్‌ చేయాలి. ఫారం ఎ,బిలు 18వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపు ఇవ్వాలి.” అని ఆయన తెలిపారు.

➡️