ఒపిఎస్‌ అమలు చేస్తాం

Congress Election Committee headed by Sharmila
  • ఐఎఎస్‌లు వైసిపికి వంతపాడడం హేయనీయం : షర్మిల

ప్రజాశక్తి- కడప ప్రతినిధి, చాపాడు/మైదుకూరు/ఖాజీపేట : మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఉద్యోగులను చూసుకున్న తరహాలోనే ప్రభుత్వోద్యోగులకు అండగా ఉంటానని, ఒపిఎస్‌ అమలు చేస్తామని పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల హామీ ఇచ్చారు. శుక్రవారం ఆమె కడప డిసిసి కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో ఒపిఎస్‌ అమలు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ముఖ్యమంత్రి జగన్‌ను ప్రశ్నించారు. జిపిఎస్‌ అక్కర్లేదని, ఒపిఎస్‌ కావాలని ఉద్యోగులు అడుతున్నా ఆయన స్పందించడం లేదన్నారు. మంత్రి బొత్సలాంటి నాయకులు ఉద్యోగులను చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. ఉద్యోగుల హక్కులను కాలరాయడం దారుణమన్నారు. ఉద్యోగ సంఘాలకు అపాయింట్‌మెంట్‌ కూడా ముఖ్యమంత్రి ఇవ్వడం లేదని విమర్శించారు. ఉద్యోగుల విషయంలో తామడిగిన నవ సందేహాలకు, 12వ పిఆర్‌సి అమలు ఆలస్యంపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కమిషన్‌ నివేదిక వచ్చే వరకు ఐఆర్‌ ఇస్తామన్న హామీ ఏమైందన్నారు. హెచ్‌ఆర్‌ఎ సచివాలయ ఉద్యోగులకు 30 శాతం నుంచి 24 శాతానికి, జిల్లా స్థాయి ఉద్యోగులకు 20 శాతం నుంచి 16 శాతానికి తగ్గించడం దారుణమని పేర్కొన్నారు. రూ.22 వేల కోట్ల ఉద్యోగుల బకాయి చెల్లింపుల సంగతేమిటని ప్రశ్నించారు. రూ.2,500 కోట్ల టిఎ, డిఎల బకాయిలను 2027లో చెల్లిస్తామనడంలో అర్థం లేదన్నారు. రూ.2,500 కోట్ల సరెండర్‌ లీవుల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రూ.118 కోట్ల మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లుల సంగతేమిటని ప్రశ్నించారు. పెన్షన్‌ పంపిణీ పేరుతో ప్రభుత్వం వృద్ధులను చంపడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రవర్తిస్తోందని విమర్శించారు. ఐఎఎస్‌లు ఒత్తిళ్లకు లొంగి వైసిపి ప్రయోజనాలకు వంతపాడటం హేయమన్నారు.
వైసిపి, టిడిపి దొందూ దొందే…
వైసిపి, టిడిపి దొందూ దొందేనని షర్మిల విమర్శించారు. వైఎస్‌ఆర్‌ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని మైదుకూరు, దువ్వూరు, చాపాడు, ఖాజీపేట మండలాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో మాట్లాడుతూ జగన్‌, చంద్రబాబు ఇద్దరూ ప్రధాని నరేంద్ర మోడీ వద్ద మోకరిల్లుతున్నారని, వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం వెంపర్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, పరిశ్రమలు, పోలవరం ప్రాజెక్టు, ఉద్యోగాలు, పరిశ్రమలు, రాజధాని గురించి మోడీని ఎందుకు ప్రశ్నించడం లేదే సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

➡️