కార్యకర్తలకు పార్టీ అండ : నారా భువనేశ్వరి

Apr 5,2024 21:47 #nara bhuvaneswari, #TDP

ప్రజాశక్తి – నంద్యాల/మహానంది : టిడిపి కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. నంద్యాల, మహానంది మండలాల్లో శుక్రవారం నిజం కావాలి అనే కార్యక్రమంలో భాగంగా ఆమె పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో గుండెపోటుతో మృతి చెందిన నల్లబోతుల చిన్న మద్దిలేటి అనే టిడిపి కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి, ఆమె ఓదార్చి భరోసా పత్రాన్ని అందజేశారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్టీకి, చంద్రబాబుకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. నంద్యాల పట్టణంలోని వెంకటాచలం కాలనీలో అబ్దుల్‌ రహీం కుటుంబాన్ని, 13వ వార్డులో వేములపాడు గురువరాజు కుటుంబాన్ని, బండిఆత్మకూరు మండలం నారాయణపురంలో కశినేని వెంకటేశ్వర్లు కుటుంబాన్ని పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టు విని ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను పరామర్శించేందుకు వస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నంద్యాల పార్లమెంట్‌ అభ్యర్థి బైరెడ్డి శబరి, శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి, న్యాయవాదులు తులసిరెడ్డి, సత్యనారాయణ చౌదరి, శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త బన్నూరు రామలింగారెడ్డి, మండల అధ్యక్షుడు ఉల్లి మధు,సర్పంచ్‌ అస్లాం బాష, చంద్రమౌలిశ్వర్‌ రెడ్డి, ఉమామహేశ్వర్‌ రెడ్డి, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️