విజయవాడలో క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించిన పవన్‌

విజయవాడ : ఎపి డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్‌ కోసం విజయవాడలో క్యాంపు కార్యాలయం సిద్ధమవుతోంది. మంగళవారం ఆయన ఆ కార్యాలయాన్ని పరిశీలించి అంగీకారం తెలిపారు. ఈరోజు ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన.. నేరుగా విజయవాడలోని జలవనరులశాఖ అతిథి గృహం వద్దకు వెళ్లారు. డిప్యూటీ సిఎంకు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఆ తర్వాత పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌సాయితో కలిసి ఆ భవనాన్ని పవన్‌ పరిశీలించారు. పైఅంతస్తులో నివాసం.. కింది అంతస్తులో కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పక్కనే సమావేశమందిరం అందుబాటులో ఉండటంతో ఈ భవనంలో ఉండేందుకు పవన్‌ అంగీకరించినట్లు సమాచారం. అధికారులకు ఆయన కొన్ని మార్పులు సూచించారు. అనంతరం జనసేన పార్టీ కార్యాలయానికి బయలుదేరివెళ్లారు. మధ్యాహ్నం సచివాలయంలో తన పేషీని పవన్‌ పరిశీలించనున్నారు. మరోవైపు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు అమరావతి ప్రాంత రైతులు సిద్ధమయ్యారు.

➡️