పిఠాపురం…. గరం గరం

పాగాకై శ్రమిస్తున్న పవన్‌
శ్రీ లోకల్‌ కార్డుతో వైసిపి అభ్యర్థి వంగ గీత
శ్రీ పోటీలో ‘ఇండియా’ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి
ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి
జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి టిడిపి-జనసేన-బిజెపి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తుండడంతో ఇక్కడి రాజకీయాలు హాట్‌ టాపిక్‌ గా మారాయి. గడచిన ఎన్నికల్లో భీమవరం, గాజువాక స్థానాల నుంచి పోటీ చేసిన పవన్‌ రెండు చోట్లా ఓటమిని చవిచూశారు. ఈసారి ఒక నియోజకవర్గం నుంచి మాత్రమే పోటీ చేస్తుండడంతో ఏం జరుగుతుందో అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. పవన్‌ కళ్యాణ్‌ విజయంపై ఆ పార్టీ శ్రేణులు భారీ అంచనాలు పెట్టుకుని పని చేస్తున్నాయి. అధినేత విజయమే లక్ష్యంగా సాయిశక్తులా కషి చేస్తున్నాయి. మరోవైపు అధికార వైసిపి నుంచి కాకినాడ ఎంపీ వంగా గీత బరిలో ఉన్నారు. జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌గా, రాజ్యసభ సభ్యురాలిగా, ఎంఎల్‌ఎగా, ఎంపీగా పనిచేసిన ఆమె పోటీ చేసిన సందర్భాలన్నింటిలోనూ ఒకసారి కూడా ఓటమిని చవి చూడలేదు. ఈ నేపథ్యంలోనే వైసిపి తన వ్యూహాలను అమలు చేసే ప్రయత్నాల్లో కనిపిస్తోంది. ఇండియా బ్లాక్‌ తరఫున కాంగ్రెస్‌ అభ్యర్థి మాదేపల్లి సత్యానందరావు పోటీ పడుతున్నారు. పిసిపి అధ్యక్షురాలు ప్రకటించిన తొలి జాబితాలోనే పిఠాపురం అభ్యర్థి పేరు ప్రకటించారు. దీంతో పిఠాపురంలో పాగా వేసేదెవరు? అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది.
అనూహ్యంగా..
గత ఎన్నికల్లో పోటీచేసిన ఏదొక నియోజకవర్గం నుంచి పవన్‌ పోటీ చేసే అవకాశం ఉందని తొలుత అందరూ భావించారు. అనంతరం పాలకొల్లు, తిరుపతి అని ప్రచారం సాగింది. కాని అనూహ్యంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. ప్రకటన చేసినప్పటి నుంచి ఆయన ఇక్కడ తరచూ పర్యటనలు చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ఒక ఇంటిని సైతం అద్దెకు తీసుకుని అక్కడి నుంచే తన కార్యకలాపాలను సాగిస్తున్నారు. పిఠాపురాన్ని మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఆయన ఓటర్లకు హామీ ఇస్తున్నారు. ఇక్కడే స్థిర నివాసం కూడా ఏర్పాటు చేసుకుంటానని, ఆధ్యాత్మిక రాజధానిగా కూడా అభివృద్ధి చేస్తానని చెబుతున్నారు. ఇటీవల చేబ్రోలులో జరిగిన సభలో నియోజకవర్గ సమస్యలపై మేనిఫెస్టోను ప్రకటించారు. పవన్‌ కళ్యాణ్‌ సోదరుడు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె నాగబాబు ఇక్కడే ఉంటూ ఇతర పార్టీల నుంచి వలసలపై దృష్టి సారించారు. మంగళవారం పవన్‌ కళ్యాణ్‌ నామినేషన్‌ సందర్భంగా భారీ ఎత్తున జనసేన శ్రేణులు హాజరు కావడంతో పవన్‌ విజయ అవకాశాలపై చర్చ మొదలైంది. ఇక్కడ ఎలాగైనా పాగా వేయాలనే లక్ష్యంతో పవన్‌ కళ్యాణ్‌ ఉన్నారు. టిడిపి ఇన్‌ఛార్జి, టిడిపి టిక్కెట్‌ ఆశించిన మాజీ ఎంఎల్‌ఎ ఎస్‌విఎస్‌ఎన్‌.వర్మతో సఖ్యతకు న్రయత్నిస్తున్నారు. తగ్గాల్సిన చోటల్లా తగ్గుతూ నెగ్గుకు రావాలనే తపనతో ముందుకు సాగుతున్నారు.
వ్యూహాలకు వైసిపి పదును
భిన్న తీర్పులకు చరిత్ర కలిగిన పిఠాపురం నియోజకవర్గంలో మళ్లీ పాగా వేయాలనే లక్ష్యంతో వైసిపి అభ్యర్థి వంగా గీత ప్రచారంలో పాల్గొంటున్నారు. పిఠాపురంతో తనకు ఎంతో అనుబంధం ఉందని, లోకల్‌గా ఉన్న తనకు స్థానిక సమస్యలపై ఎంతో అవగాహన ఉందని ఆమె ప్రజలకు చెప్పుకొస్తున్నారు. ఎంపీగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే చేపట్టానని, పరిశ్రమల స్థాపనకు భవిష్యత్తులో కృషి చేస్తానంటూ హామీ ఇస్తున్నారు. అన్ని సామాజిక వర్గాల నుంచి మంచి ఆదరణ ఉందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇక్క పవన్‌ బరిలోకి దిగడంతో ఎలాగైనా గెలవాలని వైసిపి అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్య నేతలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించి వ్యూహాలను అమలు చేస్తోంది.

పవన్‌కళ్యాణ్‌కు స్థిర, చరాస్తులు మొత్తం రూ.136.06 కోట్లు

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి
పిఠాపురం అసెంబ్లీ నుంచి జనసేన అభ్యర్థిగా ఉన్న పవన్‌కళ్యాణ్‌కు స్థిర, చరాస్తులు మొత్తంగా రూ.136.06 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. పవన్‌ కళ్యాణ్‌ మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన దాఖలు చేసిన అఫిడవిట్‌ లో తన ఆస్తులతో పాటుగా కుటుంబ సభ్యుల పేర్లుతో ఉన్న ఆస్తుల వివరాలు వెల్లడించారు. తన పేరుతో బ్యాంకు నిల్వలు, బాండ్లు, వెహికల్స్‌, బంగారం వంటివి రూ.41.65 లక్షల విలువ చేసే ఆస్తులున్నాయి. అందులో రూ.2 కోట్ల విలువ చేసే 1,680 గ్రాముల బంగారం, డైమండ్లు కూడా ఉన్నాయి. తన భార్య కొణిదెల అన్నా పేరుతో 215 గ్రాముల బంగారం సహా మొత్తం రూ.1.22 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. వాటితో పాటుగా స్థిరాస్తులుగా రూ.94.41 కోట్ల విలువైన వ్యవసాయ, వ్యవసాయేతర భూములు కూడా ఉన్నాయి. తన భార్య పేరుతో మరో రూ.1.95 కోట్ల ఖరీదైన భూములున్నట్టు పవన్‌ వెల్లడించారు. కొణిదెల పోలిన, మార్క్‌ శంకర్ల పేరుతో ఒక్కొక్కరికీ రూ.11 కోట్ల ఖరీదైన భూములున్నట్టు పేర్కొన్నారు. అలాగే రూ.65.76 కోట్లకు పైగా అప్పులు ఉన్నట్టు అఫిడవిట్‌లో ప్రస్తావించారు. పవన్‌కి అప్పు ఇచ్చిన వారిలో మైత్రీ మువీ మేకర్స్‌, డివివి ఎంటర్‌ టైన్‌మెంట్స్‌, హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌తో పాటుగా చిరంజీవి భార్య కొణిదెల సురేఖ కూడా ఉన్నారు. నెల్లూరు సెయింట్‌ జోసెఫ్‌ స్కూల్లో 1984లో తాను పదో తరగతి పాస్‌ అయినట్టు ప్రస్తావించిన పవన్‌ తనకు 10 కార్లు, ఒక హార్లీ డేవిడ్‌ సన్‌ బైక్‌ ఉన్నట్టు అఫిడవిట్‌ లో తెలిపారు.

➡️