పరిహారం వెంటనే చెల్లించండి : వి.శ్రీనివాసరావు

Dec 13,2023 10:27 #cpm v srinivasarao

 

ప్రజాశక్తి – ఎటపాక, విఆర్‌.పురం, కూనవరం(అల్లూరి సీతారామరాజు జిల్లా) : మిచౌంగ్‌ తుపాను రైతులకు తీవ్ర నష్టం చేకూర్చిందని, బాధితులకు తక్షణం పంట నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. అల్లూరి జిల్లాలోని ఎటపాక, విఆర్‌.పురం, కూనవరం మండలాల్లో తుపానుకు దెబ్బతిన్న పంటలను పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం, ఎఎస్‌ఆర్‌ రంపచోడవరం జిల్లా కార్యదర్శి బి.కిరణ్‌ తదితరులతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. రైతుల కష్టాలను తెలుసుకున్నారు. మురుమూరు గ్రామంలో గిరిజన రైతు కాకా చంద్రరావు తనకున్న రెండు ఎకరాల్లో మిర్చి సాగు చేయగా తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయానని, ఎకరానికి రూ.80 వేల చొప్పున ఖర్చయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు రైతులు తాము ఎంతగా నష్టపోయిందీ వివరించారు. అనంతరం వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రైతులు అధికంగా మిర్చి సాగు చేశారని, వైరస్‌ బారిన పడిన మిర్చి తోటలను చాలా మంది రైతులు పీకివేశారని, మరలా సాగు మొదలెట్టి ఎకరానికి లక్ష రూపాయలకుపైగా ఖర్చు పెట్టారని తెలిపారు. ఇటీవల వచ్చిన తుపాను మిర్చి పంటను తీవ్రంగా దెబ్బతీసిందని, రైతులకు లక్షల్లో నష్టం వాటిల్లిందని తెలిపారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకూ ఎకరాకు రూ.50 వేలు చొప్పున పరిహారం చెల్లించాలని, నష్టం తీవ్రత ఎక్కువుగా ఉంటే లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విలీన మండలాల్లో ప్రతి ఏడాది అతివృష్టి, అనావృష్టి వల్ల పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని, ఈసారి వరి, మిర్చి, పొగాకు, మినుము, మొక్కజొన్న పంటలు నీట మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల్లో ఎక్కువ మంది అప్పు చేసి వ్యవసాయం చేశారని, తుపాను వల్ల వారంతా అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదముందని తెలిపారు. విలీన మండలాలపై చిన్న చూపు తగదన్నారు. ఇక్కడి ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించకుంటే పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. పంటల పరిశీలనలో పార్టీ జిల్లా నాయకులు మేకల నాగేశ్వరరావు, మర్లపాటి నాగేశ్వరరావు, పూనం సత్యనా రాయణ, విఆర్‌.పురం ఎంపిపి కారం లక్ష్మి, రైతు సంఘం నాయకులు పులుసు సూర్యనారాయణ తదితరులు పాలొ న్నారు. ఎటపాక మండలం నెల్లిపాకలో గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యాన తపాలా ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగగా వారికి వి.శ్రీనివాసరావు సంఘీభావం తెలిపారు.

➡️