వేమన వర్సిటీలో పిజి విద్యార్థిని ఆత్మహత్య

Apr 16,2024 21:46 #colleges, #death, #Kadapa, #student

ప్రజాశక్తి- కడప అర్బన్‌/రాజంపేట అర్బన్‌ : యోగి వేమన యూనివర్సిటీలో పిజి బయో టెక్నాలజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సుల్తానా (22) ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. తోటి విద్యార్థినుల కథనం ప్రకారం… తరగతులు జరుగుతుండగా సుల్తానా మధ్యలో హాస్టల్‌కు వచ్చేశారు. ఆ తర్వాత తోటి విద్యార్థినులు హాస్టల్‌కు వచ్చే చూడగా ఉరి వేసుకొని ఫ్యానుకు వేలాడుతూ ఆమె కనిపించడంతో వార్డెన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు పోలీసులు తరలించారు. సుల్తానా స్వస్థలం కదిరి. ఆమె తండ్రి సౌదీలో ఉంటున్నారు. తల్లి గృహిణి. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. హాస్టల్‌ వార్డెన్‌ ఫిర్యాదు మేరకు పెండ్లిమర్రి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థిని కుటుంబానికి న్యాయం జరిగే వరకూ ఉద్యమిస్తాం
అన్నమయ్య జిల్లా రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్‌ కళాశాలలో సోమవారం అనుమానాస్పదంగా మృతి చెందిన బిటెక్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థిని రీను మహంక్‌ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ ఉద్యమిస్తామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. విద్యార్థిని మృతిపై సమగ్ర విచారణ చేయించాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, పిడిఎస్‌యు, టిఎన్‌ఎస్‌ఎఫ్‌, ఎబివిపి విద్యార్థి సంఘాల నాయకులు మంగళవారం కడప-చెన్నై రహదారి నుంచి ర్యాలీగా అన్నమాచార్య కళాశాల వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. కళాశాల ప్రధాన గేట్లు మూసివేయడంతో అక్కడే బైఠాయించి యాజమాన్యం బయటకు రావాలని నినాదాలు చేశారు. దీంతో, కళాశాల వైస్‌ చైర్మన్‌ చొప్పా యల్లారెడ్డి, ప్రిన్సిపల్‌ అక్కడికి వచ్చి విద్యార్ధి సంఘాల నాయకులతో వాగ్వివాదానికి దిగారు. మృతి చెందిన విద్యార్థిని కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరిన వారిపై కళాశాల యాజమాన్యం దౌర్జన్యానికి పాల్పడింది. దీంతో, ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. న్యాయం జరిగే వరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదని విద్యార్థి సంఘాల నాయకులు తేల్చి చెప్పాయి. ప్రస్తుతం చైర్మన్‌ అందుబాటులో లేరని, ఆయనతో మాట్లాడి రెండు రోజుల్లో న్యాయం చేస్తామని వైస్‌ చైర్మన్‌ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

➡️