పాలిటెక్నిక్‌ విద్యార్థిని ఆత్మహత్య

Feb 19,2024 08:03 #chitoor, #suside

ప్రజాశక్తి- తిరుపతి సిటీ: పాలిటెక్నిక్‌ విద్యార్థిని హాస్టల్‌ గదిలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన తిరుపతి శ్రీవెంకటేశ్వర అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం వేణుగోపాల్‌ పురానికి చెందిన టి శశి (17) పాలిటెక్నిక్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. యూనివర్సిటీలోని ప్రియదర్శిని హాస్టల్లో మొదటి అంతస్తులో మరో ముగ్గురు విద్యార్థులతో కలిసి ఆమె ఉంటోంది. ఇటీవల జరిగిన పరీక్షల్లో అన్ని సబ్జెక్టులలో ఫెయిల్‌ కావడంతో మనస్తాపానికి గురైంది. తోటి విద్యార్థులు అర్ధరాత్రి వరకు చదువుకొని ఆదివారం ఉదయం నిద్రలేచేసరికి శశి ఫ్యాన్‌కి ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించింది. వెంటనే విద్యార్థులు కేర్‌ టేకర్‌ కుమారికి సమాచారం ఇచ్చారు. హాస్టల్‌ సిబ్బంది ద్వారా విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్‌ వి రమణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి రూరల్‌ పోలీసులతో పాటు మహిళ ఎస్‌ఐ అరుణ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మఅతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

➡️