ప్రచండ భానుడు

Apr 29,2024 08:40 #Prachanda Bhanu

– నంద్యాల, కడపలో 45.9 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : భానుడు భగభగ మండిపోతున్నాడు. మరో రెండు రోజుల్లో మే నెల సమీపిస్తుండటంతో సూర్యుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం నంద్యాల జిల్లా నందికొట్కూరు, కడప జిల్లా చాపాడులో అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు జిల్లా గూడూరులో 45.5, విజయనగరం జిల్లా రామభద్రపురంలో 45.2, పార్వతీపురం మన్యం జిల్లా మక్కువలో 45.1, పల్నాడు జిల్లా నర్సారావుపేటలో 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వీటితోపాటు శ్రీకాకుళం, తిరుపతి, శ్రీసత్యసాయి, ప్రకాశం జిల్లాల్లోనూ 44 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మరోవైపు రాష్ట్రంలోని 68 మండలాల్లో ఆదివారం తీవ్ర వడగాడ్పులు వీయగా.. 120 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంది. సోమవారం దాదాపు 200 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అనకాపల్లి, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్‌టిఆర్‌, పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని ఆ సంస్థ హెచ్చరించింది.

ఇళ్లల్లోంచి బయటకు రాని జనం
ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఓవైపు తీవ్ర ఉష్ణోగ్రతలకు తోడు, ఉక్కపోత కూడా తోడుకావటంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకే జనాలు జంకుతున్నారు. ఉదయం 10 తర్వాత ప్రజలు బయటకు వచ్చేందుకు సంకోచిస్తున్నారు. అలాగే సాయంత్రం 4 దాటితే గానీ బయటకు వచ్చే సాహసం చేయటం లేదు. మరోవైపు ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు పెరుగుతుండటంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయకూడదని హెచ్చరిస్తున్నారు.

➡️