ప్రజల్లోకి విస్తృతంగా డిమాండ్లు సాధనకై ఐక్య ఉద్యమాలు- పార్టీలపై ఒత్తిడి

Nov 29,2023 08:38 #closed, #maha dharna

– ముగిసిన కార్మిక, కర్షక మహాధర్నా

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి/అమరావతి బ్యూరోకేంద్రంలో, రాష్ట్రంలో.. ఎక్కడ ఏ ప్రభుత్వం అధికారంలోకొచ్చినా రైతుల, కార్మికుల డిమాండ్లు అమలు చేసి తీరాల్సిందేనని విజయవాడ జింఖానా గ్రౌండ్‌ వేదికగా నిర్వహించిన కార్మిక, రైతు మహాధర్నా స్పష్టం చేసింది. కార్మికులు, కర్షకులు కలిసికట్టుగా సాగిస్తున్న ఉద్యమాలే వారి ఈతిబాధలను ఎజెండా మీదకి తీసుకొచ్చాయని వక్తలు చెప్పారు. మహాధర్నా ముందుకు తెచ్చిన అంశాలను ప్రజల్లోకి విస్రృతంగా తీసుకెళ్లి చైతన్యం చేసి ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలపై ఐక్య పోరాటాలతో ఒత్తిడి తేవాలని కర్తవ్య బోధ చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదికిపైగా సాగి, మోడీ ప్రభుత్వ మెడలు వంచిన వీరోచిత రైతు పోరాట స్ఫూర్తిగా దేశ వ్యాప్త పిలుపులో భాగంగా ఎపి కార్మిక సంఘాల ఐక్య వేదిక, ఎపి రైతు సంఘాల సమన్వయ సమితి సంయుక్తంగా సోమవారం చేపట్టిన 36 గంటల రాష్ట్ర మహాధర్నా మంగళవారం సాయంత్రం ముగిసింది. నిర్వాహకులు ఊహించిన దానికంటే మిన్నగా ధర్నా జయప్రదమైంది. రైతుల, కార్మికుల, వ్యవసాయ కార్మికుల స్పందన వెల్లువెత్తింది. పలువురి నుంచి సంఘీభావం లభించింది. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి కార్మికులు, కర్షకులు, శ్రామికులు ఉత్సాహంగా ధర్నాకు తరలివచ్చారు. రెండు రోజులూ కదలకుండా అక్కడే బస చేశారు. వేల మంది వచ్చినప్పటికీ ఎక్కడా ఇబ్బందులు కలగకుండా భోజన, వసతి ఏర్పాట్లు చేశారు. మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గనడం విశేషం. తమ డిమాండ్లతో కూడిన నినాదాలు, సంఘాల బ్యానర్లు, జెండాలతో హోరెత్తించారు. సమరోత్సాహం ప్రదర్శించారు. ధర్నా ప్రారంభం నుంచి చివరి వరకు కదలకుండా శ్రద్ధగా నాయకుల ప్రసంగాలు ఆకళింపు చేసుకున్నారు. ప్రజానాట్యమండలి, ఎపి ప్రజానాట్యమండలి, అరుణోదయ కళాకారుల ప్రదర్శనలు, గేయాలు అందరినీ కట్టిపడేశాయి. కాగా రైతులకు కనీస మద్దతు ధరలు, రైతులకు, కౌలు రైతులకు రుణాలు, ఆత్మహత్యల నివారణ, అసంఘటిత కార్మికులకు, స్కీం వర్కర్లకు, కాంట్రాక్టు, ఔట్‌సోర్స్‌ ఉద్యోగులకు కనీస వేతనాలు, చట్టబద్ధ బెనిఫిట్‌లు, రెగ్యులరైజేషన్‌, ఆదివాసీల హక్కులు, విశాఖ ఉక్కు సహా ప్రభుత్వరంగం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, వ్యవసాయ కార్మికులకు ఉపాధి పనులు, రాజ్యాంగ, పౌర హక్కులు, లౌకిక ప్రజాస్వామ్య, ఫెడరలిజం పరిరక్షణ ఇత్యాది 37 అంశాలపై చర్చించారు. డిమాండ్లు పెట్టారు. తీర్మానాలు ఆమోదించారు. వాటి సాధనకు ఐక్యంగా ఉద్యమించాలని ధర్నా దిశా నిర్దేశం చేసింది. కేంద్రంలో మోడీ సర్కారును ఓడించి దేశాన్ని రక్షించుకోవాలన్న రాజకీయ లక్ష్య సాధనను మార్గ నిర్దేశం చేసింది. రాష్ట్రంలో బిజెపికి మద్దతిచ్చే పార్టీలు ఆలోచించుకోవాలని, లేదంటే వారినీ ఓడిస్తామని మహా ధర్నా హెచ్చరించింది. ధన్యవాదాలు: వడ్డేధర్నాకు వేలాదిగా తరలివచ్చి అనుకున్నదానికంటే మిన్నగా విజయవంతం చేసిన రైతులు, కార్మికులకు ఎపి రైతు సంఘాల కన్వీనర్‌, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. మహిళలు ఇంత దూరం ధర్నాకు చైతన్యంతో కదలడం భవిష్యత్తు ఉద్యమాలకు ఉత్సాహాన్నిస్తుందన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పారు. ఎపి రైతు సంఘం నాయకులు వై కేశవరావు మాట్లాడుతూ ధర్నా సన్నాహాల కోసం కృషి చేస్తున్న సమయంలో శోభనాద్రీశ్వరరావు రెండు తడవలు అస్వస్తులయ్యారని, గుంటూరు ఆస్పత్రిలో చేరారని, ఆపై హైదరాబాద్‌లోనూ చికిత్స తీసుకున్నారని తెలిపారు. ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా కృషి చేసి తమందరిలో స్ఫూర్తి నింపారన్నారు.

➡️