పోటీగా ప్రయివేటు కార్మికులు – ట్యాంకుపైకెక్కి కార్మికుల నిరసన

Dec 31,2023 10:46

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : మున్సిపల్‌ కార్మికుల సమ్మె నేపథ్యంలో … ఇంజనీరింగ్‌ విభాగంలో 100 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి పోటీ కార్మికులను మున్సిపల్‌ అధికారులు రంగంలోకి దించడంతో మున్సిపల్‌ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న మున్సిపల్‌ కార్మికులతో పని చేయించుకుంటే అభ్యంతరం లేదని, పోటీ కార్మికులను పనిలోకి తీసుకుంటే ఊరుకునేది లేదని మున్సిపల్‌ కార్మికులు హెచ్చరించారు. కార్మికులు డిమాండ్‌ చేస్తున్నప్పటికీ పట్టించుకోకుండా మున్సిపల్‌ కమిషనర్‌ బయటికి వెళ్ళేందుకు కారు ఎక్కగా కార్మికులు కారుకు అడ్డుపడి గేట్లు మూసి అడ్డుకున్నారు. పలువురు కార్మికులు ట్యాంక్‌ పైకి ఎక్కి నిరసన తెలిపారు. పోటి కార్మికులను పనిలోకి దింబోమని స్పష్టమైన హామీ ఇస్తేనే పైనుంచి కిందకి దిగుతామని డిమాండ్‌ చేస్తున్నారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎఐటియుసి, సిఐటియు, నేతలు కార్మికులకు అండగా నిలిచారు. కార్మికులు విధులు బహిష్కరిస్తామన్నారు. పోటీ కార్మికులను రంగంలోకి దించితే సహించేది లేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు సంఘీభావంగా టిడిపి నియోజకవర్గ బాధ్యులు డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు మున్సిపల్‌ అతిధి గృహం వద్దకు వచ్చారు.

➡️