6 జిల్లాల్లో వర్షాలు

Apr 22,2024 07:54 #Araku, #heavy rains
  • ఒక్కసారిగా మారిన వాతావరణం
  • కొన్ని జిల్లాల్లో తప్పని వడగాడ్పులు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సూర్యుని ప్రకోపానికి అట్టుడికిపోయిన రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగించేలా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గడిచిన 20 రోజులుగా ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజానీకంపై వరుణుడు కరుణ చూపించి, చల్లటి చిరుజల్లులను కురిపించాడు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆరు జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. నంద్యాల జిల్లాలో అత్యధికంగా 18.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీసత్యసాయి జిల్లా ముక్తాపురంలో 13 మిల్లీమీటర్లు, విజయనగరం జిల్లా బొండపల్లిలో 12.5, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీలో 14.5, వై రామవరంలో 10, తిరుపతి జిల్లా నాగులాపురం మండలంలో 7.5, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 7.25 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. సోమవారం కూడా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలతోపాటు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

హుకుంపేటలో షాపుపై కూలిన చెట్టు
అల్లూరి జిల్లా హుకుంపేటలో ఈదురుగాలులతో కూడిన వర్షానికి మూడు షాపులపై చెట్టు కూలింది. ఆ సమయంలో మటన్‌, టైలర్‌ షాపులు, టీ పాయింట్ల వద్ద ఉన్న వారు బయటకు పరుగులు తీశారు. కొంత మేర ఆస్తినష్టం జరిగింది.

నేడు 90 మండలాల్లో వడగాడ్పులు
వాతావరణం చల్లబడినప్పటికీ, కొన్ని జిల్లాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని వాతావరణ సంస్థ హెచ్చరించింది.
సోమవారం రాష్ట్రంలోని దాదాపు 90 మండలాల్లో వడగాడ్పులు ఉంటాయని పేర్కొంది. శ్రీకాకుళంలోని 9 మండలాలు, విజయనగరంలోని 8, పార్వతీపురం మన్యంలోని 9 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని, తిరుపతిలోని 3, ప్రకాశంలోని 9, ఎన్‌టిఆర్‌లోని 1, అనకాపల్లిలోని 3, విజయనగరంలోని 16, శ్రీకాకుళంలోని 10 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని పేర్కొంది.

36 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు
ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 36 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీయగా.. 82 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. తిరుపతి జిల్లా రేణిగుంటలో ఆదివారం గరిష్టంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని 14 మండలాల్లో రాబోయే 48 గంటల్లో 45 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

➡️