‘ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌’ జాతికి అంకితం

Feb 4,2024 08:34 #INS Sandhayak, #visakhapatnam

ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : సర్వే నౌక ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్‌ సింగ్‌ శనివారం జాతికి అంకితం చేశారు. తూర్పు నావికాదళానికి చెందిన మొదటి సర్వే వెసెల్‌ లార్జ్‌ (ఎస్‌విఎల్‌) నౌకగా పేరుగాంచిన సంధాయక్‌ను జాతికి అంకితమిచ్చే కార్యక్రమం విశాఖ నేవల్‌ డాక్‌ యార్డులో వేడుకగా సాగింది. ఓడరేవులు, నౌకాశ్రయాలు, నావిగేషనల్‌ ఛానల్స్‌, తీరప్రాంతాలు, లోతైన సముద్రాలపై ఈ నౌక పూర్తి స్థాయి హైడ్రోగ్రాఫిక్‌ సర్వేలు నిర్వహించి సురక్షితమైన సముద్ర నావిగేషన్‌కు వీలు కల్పించనుంది. ప్రారంభ కార్యక్రమంలో మంత్రి రాజనాథ్‌సింగ్‌ మాట్లాడుతూ ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో సూపర్‌ పవర్‌గా ఉన్న భారత్‌ను ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌ మరింత బలోపేతం చేయనుందన్నారు. సముద్రం, దాని ఆవరణ శాస్త్రం, వృక్ష, జంతు జాలాల గురించి మనం ఎంత ఎక్కువ సమాచారాన్ని సేకరిస్తే మన లక్ష్యాలను సాధించడం అంత సులభమవుతుందని తెలిపారు. చీఫ్‌ ఆఫ్‌ నేవల్‌ స్టాఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌.హరి కుమార్‌ మాట్లాడుతూ నేవీ దేశీయంగా అత్యాధునిక నౌకలను ప్రారంభిస్తోందని తెలిపారు. ఈ క్రమంలోనే శక్తివంతమైన విమాన వాహక నౌక విక్రాంత్‌, డిస్ట్రాయర్లు, బహుముఖమైన నీలగిరి క్లాస్‌ ఫ్రిగేట్‌లు, అధునాతన జలాంతర్గాములను రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. 66 షిప్‌లను, 64 సబ్‌మెరైన్‌లను భారతీయ షిప్‌యార్డ్‌ల్లో నిర్మిస్తున్నట్లు తెలిపారు.

➡️