బిజెపితో టిడిపి, జనసేన పొత్తు రాష్ట్రానికి అంధకారమే

Release of "CPM Women's Plan".

-గ్యాస్‌ ధర తగ్గింపు కంటితుడుపు చర్య : వి శ్రీనివాసరావు

– సిపిఎం మహిళా ప్రణాళిక ఆవిష్కరణ

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి :బిజెపితో టిడిపి, జనసేన పొత్తు రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టి వేయడమేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. సిపిఎం గుంటూరు జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల అభ్యున్నతికి తీసుకోవాల్సిన అంశాలపై ప్రణాళికను విడుదల చేశారు. ఈ ప్రణాళిక కేవలం మహిళలకే కాకుండా మానవజాతికి ఉపయోగపడుతుందన్నారు. మహిళల హక్కులు కాపాడడం, వారికి రక్షణ కల్పించడం, మహిళా ఉద్యమాల్లో పురుషులు కూడా అండగా నిలవడం ద్వారా సామాజిక అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మహిళల అభ్యున్నతికి రాజకీయ పార్టీలు తగిన ప్రాధాన్యత ఇస్తూ ప్రణాళికలు రూపొందించాలని కోరారు. రాష్ట్రానికి అన్ని విధాల ద్రోహం చేసిన బిజెపితో పొత్తు పెట్టుకోవడం ద్వారా ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని టిడిపి, జనసేన పార్టీలను ప్రశ్నించారు. విభజన చట్టంలో హామీలను పదేళ్లగా అమలు చేయకుండా రాష్ట్రానికి బిజెపి అన్యాయం చేసిందన్నారు. అటువంటి పార్టీతో ఇప్పటివరకు వైసిపి లోపాయికారి ఒప్పందం చేసుకొని విభజన చట్టం హామీలను పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పుడు బిజెపితో టిడిపి, జనసేన పొత్తు పెట్టుకోవడమంటే విభజన చట్టానికి తీవ్ర అన్యాయం చేసినట్టేనని అన్నారు. పదేళ్లపాటు గ్యాస్‌ ధరలను విపరీతంగా పెంచి మహిళా దినోత్సవం పేరుతో రూ.100 తగ్గించడం కంటితుడుపు చర్యని పేర్కొన్నారు. దేశంలో గ్యాస్‌ సిలిండర్‌ను కేవలం రూ.400కు విక్రయించవచ్చని తెలిపారు. అయినా, అధిక ధరకు విక్రయిస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నంలో భాగంగా తాత్కాలికంగా రూ.100 ధర తగ్గించారన్నారు. నరేంద్ర మోడీ 2014 ఎన్నికల్లో అభివృద్ధి గురించి మాట్లాడారని, 2019లో ఉగ్రవాదాన్ని బూచిగా చూపారని, 2024లో అయోధ్య రామాలయం గురించి ఎక్కువగా మాట్లాడుతూ ప్రజలను మతం పేరుతో విడగొట్టే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. దేశంలో నల్లధనాన్ని బయటకు తీసుకొచ్చి ప్రజలకు పంచి పెడతానన్న మోడీ తన హామీని ఇంతవరకు నిలుపుకోలేదని గుర్తు చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. 2017-18 నుంచి 2022-23 వరకూ రూ.12,008 కోట్ల ఎన్నికల బాండ్లలో అత్యధిక శాతం బిజెపికి అందాయని తెలిపారు. ఎన్నికల బాండ్ల వివరాలు ఇచ్చేందుకు జూన్‌ 30 వరకూ గడువు కావాలని సుప్రీంకోర్టుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా కేంద్ర ప్రభుత్వం చెప్పించడం విడ్డూరంగా ఉందన్నారు. వివరాలన్నీ ఒక రోజులో ఇవ్వచ్చని తెలిపారు. ఎన్నికల బాండ్ల రూపంలో కార్పొరేట్‌ సంస్థల నుంచి అక్రమంగా విరాళాలు పొందిన బిజెపి నిజాయితీ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. బిజెపి పాలనలో మనుధర్మం అమలుకు ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు. గత పదేళ్లలో దేశంలో మహిళలపై అత్యాచారాలు పెరిగాయని తెలిపారు. మహిళల అణచివేతను చట్టబద్ధం చేస్తున్నారని విమర్శించారు. కంటితుడుపుగా మహిళా రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంట్లో ఆమోదించారని, బిల్లు ఆమోదించినా ప్రస్తుత ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు కావడం లేదని తెలిపారు. రాష్ట్రంలో దిశా చట్టం ఎక్కడా అమలు కావడం లేదన్నారు. ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, జిల్లా కమిటీ సభ్యులు బి కోటేశ్వరి, ఎల్‌ అరుణ, సుధాకిరణ్‌ పాల్గొన్నారు.

మహిళా ప్రణాళికలోని అంశాలుా

  • సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి
  • దిశ చట్టానికి చట్టబద్ధత కల్పించాలి. పోలీస్‌ స్టేషన్‌లు మహిళా మిత్రలుగా ఉండాలి. అందుకు అవసరమైన మార్పులు చేయాలి.
  • మహిళా పౌర హక్కులను గౌరవిస్తూ ప్రత్యేక చట్టం చేయాలి
  • మద్య నియంత్రణ, మత్తు మందుల నివారణ, మహిళలపై హింస నివారణకు చర్యలు తీసుకోవాలి
  • ఉపాధి కల్పనకు పని విధానాలు రూపొందించాలి
  • పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి పనులు కల్పిస్తూ చట్టం చేయాలి
  • కోటి మందికిపైగా ఉన్న డ్వాక్రా మహిళల రుణాలపై జీరో వడ్డీ అమలు చేయాలి
  • ఉత్పత్తికి అవసరమైన శిక్షణ ఇవ్వాలి. మార్కెటింగ్‌ గ్యారెంటీ కల్పించాలి. పొదుపు సొమ్ముతో అంతర్గత రుణాలు ఇచ్చే విధంగా, అవినీతి నిర్మూలించే విధంగా చర్యలు ఉండాలి
  • ధరలు పెరగకుండా చౌక ధరల దుకాణాలలో నిత్యావసరాలు తక్కువ ధరకు సరఫరా చేయాలి
  • శ్రామిక మహిళలకు ధరల పెరుగుదలకు అనుగుణంగా జీతాలు పెంచాలి
  • శ్రామిక మహిళాలకు గుర్తింపు కార్డులిచ్చి మెటర్నటీ సదుపాయాలతో సహా సంక్షేమ చర్యలు చేపట్టాలి
➡️