రూ.101 కోట్లతో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకుల మరమ్మతులు

Apr 16,2024 22:25 #ap cs, #jawahar reddy
  •  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని 1,669 సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులను రూ.101 కోట్లతో మరమ్మతులు చేస్తున్నామని, ఆ పనులన్నీ వారం రోజుల్లోపు పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌ రెడ్డి ఆదేశించారు. వెలగపూడిలోని సచివాలయం నుంచి తాగునీరు, విద్యుత్‌, ఉపాధి హామీ పనులపై సంబంధిత శాఖాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి తాగునీటి అవసరాల దృష్ట్యా అన్ని సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులనూ పూర్తిగా నీటితో నింపాలని ఆదేశించారు. తాగునీటి ఎద్దడి గల ఆవాసాలకు జూన్‌ నెలాఖరు వరకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు. తాగునీటి అవసరాల నిమిత్తం ప్రకాశం బ్యారేజ్‌ నుంచి బందరు, రైవస్‌, ఏలూరు కాలువలకు, సాగర్‌ కుడి కాలువ నుంచి పల్నాడు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల జిల్లాలకు నీటిని విడుదల చేశామని, వెంటనే అన్ని సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులను నీటితో నింపాలన్నారు. ఈ వేసవిలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది రాకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధి హామీ పనులపై సమీక్షిస్తూ.. గత మూడు రోజుల్లో ఉపాధి హామీ రోజువారీ పనులు 11 లక్షల నుంచి 22 లక్షలకు పెరిగాయని చెప్పారు. విద్యుత్‌ సరఫరాలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకూడదన్నారు.
ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 240 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం జరుగుతోందని, దానికనుగుణంగానే విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని చెప్పారు. గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, పంచాయతీరాజ్‌ కమిషనరు కె కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

➡️