భారతీయ న్యాయ సంహిత సెక్షన్‌ 106ను రద్దు

Feb 8,2024 09:57 #Pensioners, #Protest
Repeal of Section 106 of the Indian Code
  • సమ్మెను జయప్రదం చేయండి
  • రవాణా రంగ కార్మికులకు ఎఐఆర్‌టిబ్ల్యుఎఫ్‌ పిలుపు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రవాణా రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టేలా డ్రైవర్లకు కఠిన శిక్షలను అమలు చేసేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసు కొచ్చిన భారతీయ న్యాయ సంహిత 106(1) (2) చట్టసవరణను తక్షణం రద్దు చేయాలని ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్‌ లక్ష్మయ్య డిమాండ్‌ చేశారు. ఈ చట్ట సవరణ రద్దు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జాతీయస్థాయిలో అన్ని కార్మిక సంఘాలు ఈ నెల 16న చేపట్టనున్న జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని ఆయన రవాణా రంగ కార్మికులకు పిలుపునిచ్చారు. భారతీయ న్యాయ సంహిత 106(1), (102) చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎఐఆర్‌టిడబ్ల్యుఎఫ్‌ ఆధ్వర్యాన బుధవారం విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఎఐఆర్‌టిడబ్ల్యుఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు శివాజీ, ఐఎఫ్‌టియు నగర అధ్యక్షులు మునిశంకర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఆర్‌ లక్ష్మయ్య మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రోడ్లపై జరిగే ప్రమాదాలకు కఠిన కారాగార శిక్షలు, లక్షల రూపాయలు జరిమానాలు విధించడం సరైంది కాదన్నారు. రోడ్లపై జరిగే ప్రమాదాలకు చాలా కారణాలు వుంటాయని, వాటిపై అధ్యయనం చేసి పరిష్కారాలు చూపకుండా డ్రైవర్లపైనే నెపం నెట్టడం సరైంది కాదన్నారు. ఇలాంటి శిక్షలు, జరిమానాలు అమలు చేస్తే డ్రైవింగ్‌ వృత్తిలోకి వచ్చేవారు ఎవరూ వుండరని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైవర్లంతా ఈ చట్టాన్ని రద్దు చేయించేందుకు ఐక్యం కావాలని కోరారు. ఎపి లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వరరావు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల మూలంగా రవాణా రంగం ఇప్పటికే సంక్షోభంలోకి పోయిందన్నారు. విపరీతంగా కేసులు రాయడం, పన్నులు పెద్ద ఎత్తున విధించడం వల్ల యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. కార్మిక సంఘాలు చేపట్టనున్న జాతీయ సమ్మెలో యజమానుల సంఘాలన్నీ పాల్గొంటాయని తెలిపారు. కార్మికులు, లారీ యజమానులు సంఘ టితంగా రవాణా రంగాన్ని కాపాడుకోవాలన్నారు. సదస్సులో ఎఐఆర్‌టిడబ్ల్యుఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్‌ ముజఫర్‌ అహ్మద్‌, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు, ఐఎఫ్‌టియు నగర ప్రధాన కార్యదర్శి దాడి శ్రీనివాస్‌, ఎఐటియుసి రాష్ట్ర నాయకులు వామనమూర్తి, ఎఐసిసిటియు జిల్లా నాయకులు కిషోర్‌, టిఎన్‌టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెంటపల్లి శ్యామ్‌, టిఎన్‌టియుసి నాయ కులు గరిమెళ్ల నాని, సిఐటియు నాయకులు శ్రీనివాస్‌, దుర్గారావు, రూబేన్‌, శ్రీనివాస్‌, పోలినాయుడు పాల్గొన్నారు.

 

➡️