నేడు రవాణా రంగం బంద్‌

road tranport bandh on feb 16

జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నరసింగరావు పిలుపు

ప్రజాశక్తి-విశాఖ : రోడ్డు రవాణా డ్రైవర్లుకు ఊరిత్రాడు వంటి సెక్షన్‌ 106 (1&2), మోటారు ట్రాన్స్‌పోర్టు సవరణ చట్టం 2019, జివో నెం. 21ని రద్దు చేయాలని, డ్రైవర్లుకు సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలని, పెట్రోల్‌, డీజిల్‌లో పన్ను మినహాయింపు ఇవ్వాలని డిమాండ్లతో ఫిబ్రవరి 16న రవాణా బంద్‌ చేపట్టారు. ఈ బంద్ ను జయప్రదం చేయాలని సిఐటియు, ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, విశాఖ లారీ ఆపరేటర్స్‌, క్వారీ లారీ, ఆటో, మోటారు, క్యాబ్‌, టాటా మ్యాజిక్‌, వ్యాన్‌లు, లారీ, గ్యాస్‌ ట్యాంకర్స్‌, క్రేన్‌ ఆపరేటర్స్‌ సంఘాల నాయకులు ఈ రోజు జరిగిన సదస్సులో పాల్గొని పిలుపునిచ్చారు. ఈ సదస్సుకు పి.రాజుకుమార్‌ అధ్యక్షత జరిగింది. సిఐటియు రాష్ట్ర ప్రధానకార్యదర్శి సి.హెచ్‌.నరసింగరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి బి.జగన్‌, మోటారు యూనియన్‌ ప్రధాన కార్యదర్శి జి.అప్పలరాజు, ఆటో యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కె.సత్యనారాయణ, ఆర్‌టిసి నాయకులు అప్పడు, శివ, క్యాబ్‌ యూనియన్‌ అధ్యక్షులు సిహెచ్‌. శ్రీనివాసరావు, లారీ ఆపరేటర్స్‌ ట్రైజరర్‌ కాశీ విశ్వనాధం, క్వారీ అధ్యక్షులు రమణ, క్రేన్‌ ఆపరేటర్స్‌, హైర్‌ బస్‌ నాయకులు అర్జున్‌ తదితరులు పాల్గొని మాట్లాడారు. పెద్ద సంఖ్యలో డ్రైవర్లు పాల్గొన్నారు.
ఈ సదస్సుకు ముఖ్య వక్తగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్‌.నరసింగరావు మాట్లాడుతూ ”రవాణా రంగాన్ని, రోడ్లులను నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌ లైన్‌ క్రింద ప్రైవేటు వారికి ధారదత్తం చేస్తున్నారు. ఒనర్‌ కమ్‌ డ్రైవర్స్‌ను లేకుండా చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగమే మోటారు ట్రాన్స్‌పోర్టు చట్టం, సెక్షన్‌ 106 (1&2) అనేక దాడులు చేస్తున్నారు. రవాణా రంగంలో అత్యధిక మంది ప్రయాణీకులకు సేవలందించే వారిలో రోడ్డు రవాణా డ్రైవర్లది కీలకస్థానం. ప్రభుత్వాలు ఏ విధమైన సహాయం చేయకపోయినా, తమ సొంత పెట్టుబడితో ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీల ద్వారా ఆటో రిక్షాలను కొనుగోలు చేసి, స్వయం ఉపాధిగా జీవనం సాగిస్తున్నారు. ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీల అధిక వడ్డీలకు బలైపోతున్నారు. ప్రభుత్వాలు ఉపాధి కల్పించకపోవడంతో స్వయం ఉపాధిగా ఆటోలు నడుపుతూ తమ కుటుంబ పోషణ కోసం ప్రతిరోజు ప్రయాణికులకు సేవలందిస్తూ బాలీచాలని ఆదాయంతో అర్ధాకలితో జీవిస్తున్నారు. కనీసం సహాయం చేయడం మానివేసినా అదనంగా కేసులు, ఫైనాల్టీలు, జైలు శిక్షలు రద్దు చేయాలని, సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలని ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా ఆటోల బంద్‌ను జయప్రదం చేయాలని’ విజ్ఞప్తి చేశారు.

  • డ్రైవర్ల మెడకు ఉరితాడు ఇలా…

‘కేంద్రంలోని మోడీ ప్రభుత్వం డ్రైవర్ల మెడకు ఉరితాడు బిగించే విధంగా సెక్షన్‌లు 106 (1) (2) హిట్‌ అండ్‌ రన్‌. చట్టాన్ని 21 డిసెంబర్‌ 2023న తీసుకువచ్చింది. గతంలో ప్రమాదానికి డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణం అయితే గరిష్టంగా 2 సంవత్సరాలు శిక్ష ఉండేది. ఇప్పుడు మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన సెక్షన్‌ 106 (1) (2) ప్రకారం 10 సంవత్సరాల జైలు 7 లక్షల జరిమానా విధించేలా నిబంధనలు తయారు చేసింది. ఇప్పటివరకు ప్రమాదాలు జరిగిన వెంటనే స్టేషన్‌ బెయిల్‌ తీసుకునే అవకాశం ఉండేది. కొత్త చట్టంలోని నిబంధనల వలన కోర్టులో మెయిల్‌ కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. జివో నెం. 21 & 2019 మోటారు ట్రాన్స్‌పోర్టు చట్టంలో భారీగా పెంచిన జరిమానాలు అమలులోకి వచ్చి 4సంవత్సరాలయ్యింది. కానీ ప్రమాదాలు తగ్గలేదు సరికదా 2022లో ప్రమాదాలు పెరిగాయని ప్రభుత్వ గణాంకాలే తెలియజేస్తున్నాయి. అందుచేత ప్రమాదాలకు అసలైన కారణాలను పరిష్కరించకుండా శిక్షలు పెంచితే ప్రమాదాలు తగ్గుతాయని చెప్పడం మోసగించడమేనని అనుభవం రుజువు చేస్తున్నది.
రవాణా రంగ కార్మికుల ద్వారా ప్రభుత్వాలకు లక్షల కోట్ల రూపాయలు సంపాదించి పెడుతున్న మోటారు కార్మికుల సంక్షేమానికి ఎటువంటి చట్టం లేకుండా పోయింది. డ్రైవర్లు ఏ విధమైన ప్రమాదానికి గురి అయినా ఆ కుటుంబానికి ఎటువంటి ఆర్ధిక సహాయం అందడం లేదు. ఆటో డ్రైవర్లు ఇతర రవాణా రంగ కార్మికులకు రక్షణ కల్పించే విధంగా కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, డిల్లీ రాష్ట్రాల తరహాలో సమగ్ర సంక్షేమ చట్టాన్ని చేయాలని వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయాలని’ సిఐటియు డిమాండ్‌ చేస్త్తున్నది.

  • ప్రతి డ్రైవర్ పై కనీసం 60వేల పన్ను 

ప్రతి డ్రైవరు కనీసం రోజుకు 3లీటర్లు నుండి 10లీటర్లు వరక డీజిల్‌, పెట్రోల్‌ వినియోగిస్తున్నాము. తక్కువలో తక్కువ 3లీటర్లు అనుకున్న ఒక లీటరుకు ప్రభుత్వానికి కడుతున్న అన్ని రకాల పన్నులు 48/-రూ॥లు వరకు వుంది. అంటే ఒక రోజుకు 144 రూ॥లు, నెలకు 5వేలు, సంవత్సరానికి 60వేలు పెట్రోలు, డీజిల్‌ వాడడం వలన ఒక డ్రైవర్‌ పన్నులు కడుతున్నాము. మనము మన కుటుంబ అవసరాలకు కాకుండా ప్రజలు సౌకర్యం కోసం వినిమోగిస్తున్నాము. పెట్రోల్‌కు పన్ను మినహాంపు ఇవ్వాలి. అలాగే రవాణా రంగ కార్మికులకు రక్షణ కల్పించే విధంగా సమగ్ర సంక్షేమ చట్టాన్ని చేయాలని, డ్రైవర్లు ఊరిత్రాడు అయిన హిట్‌ – రన్‌, మోటారు చట్టం 2019, జివో నెం. 21 రద్దు చేయాలని, పెట్రోల్‌, డీజిల్‌ సబ్సిడీ ధరలకు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ 2024 ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్త ఒకరోజు బంద్‌లో డ్రైవర్లందరూ పాల్గొనాలని సిఐటియు విజ్ఞప్తి చేసింది.

➡️