రూ.13.60 లక్షలు స్వాధీనం

Apr 9,2024 22:43 #2024 elections, #havala money, #sized

ప్రజాశక్తి – యంత్రాంగం : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసులు మంగళవారం పలుచోట్ల చేపట్టిన వాహన తనిఖీల్లో పెద్దమొత్తంలో తరలిస్తున్న నగదును పట్టుకున్నారు. సరైన పత్రాలు లేని నగదును సీజ్‌ చేశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని పైడిభీమవరం వద్ద తనిఖీల్లో రూ.6.75 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన కాంట్రాక్టరు సతీష్‌ రెడ్డి అనపర్తి నుంచి కోటబొమ్మాళికి కారులో వెళ్తున్నారు. పోలీసులు కారును తనిఖీ చేయగా రూ.6.75 లక్షల నగదు పట్టుబడింది. ఇందుకు సంబంధించిన ఎటువంటి రశీదులు, ఆధారాలు చూపకపోవడంతో ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జె.ఆర్‌ పురం ఎస్‌ఐ కె.గోవిందరావు తెలిపారు. ఏలూరు జిల్లా కామవరపుకోట వద్ద వాహనాల తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.2.15 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు చెక్‌పోస్ట్‌ ఇన్‌ఛార్జి కె.బాబూరావు తెలిపారు. రావికంపాడుకు చెందిన ఒక వ్యక్తి నుండి రూ.60 వేలు, పాత గండిగూడెం గ్రామానికి చెందిన ఒక మహిళ వద్ద రూ.1.55 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. తగిన ఆధారాలు చూపకపోవడంతో ఆ నగదును సీజ్‌ చేశారు. కొయ్యలగూడెం మండలం రామాంజనేయపురం గ్రామానికి చెందిన వ్యక్తి ద్విచక్ర వాహనంపై జంగారెడ్డిగూడెం వస్తుండగా కొవ్వూరు రోడ్డులోని పాతబస్టాండ్‌ సెంటర్‌లో రూ.1.20 లక్షల నగదును పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. పెదవేగి మండలం విజయరాయి సమీపంలోని బలివే అడ్డరోడ్డు వద్ద వాహన తనిఖీల్లో 1.35 లక్షల నగదు పట్టుబడింది. అనపర్తి నుంచి ధర్మాజీగూడెం మీదుగా ఏలూరువైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న చందురెడ్డి, శంకర్రావు అనే ఇద్దరు వ్యక్తుల దగ్గర ఎటువంటి ఆధారాలు లేకుండా నగదును తరలిస్తున్నట్లు గుర్తించి సీజ్‌ చేశారు. లింగపాలెం మండలానికి చెందిన పాస్టర్‌ ఏలియ్య కారులో తరలిస్తున్న రూ.1.50 లక్షలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సీజ్‌ చేసిన సొమ్మును ఏలూరు జిల్లా ట్రెజరీలో జమ చేశామని, సంబంధీకులు సరైన ఆధారాలు చూసిస్తే ఆ నగదును తిరిగి ఇచ్చేస్తామని పెదవేగి తహశీల్దార్‌ సూర్యప్రభ తెలిపారు.

➡️