బిజెపి మళ్లీ అధికారంలోకొస్తే ఆర్‌టిపిపి ప్రయివేటీకరణే

May 2,2024 21:30 #ap congress, #BJP, #coments, #ys sharmila
  • ఎన్నికల ప్రచారంలో పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల

ప్రజాశక్తి-వైఎస్‌ఆర్‌ జిల్లా యంత్రాంగం : రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు (ఆర్‌టిపిపి)ని కూడా ప్రయివేటీకరించాలని బిజెపి ప్రభుత్వం చూస్తోందని పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల అన్నారు. అదానీ, అంబానీలకు కట్టబెట్టేందుకు మోడీ సర్కారు కుట్రలు పన్నుతోందని విమర్శించారు. వైఎస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగు నియోజవకర్గంలోని పెద్దముడియం, జమ్మలమడుగు, ముద్దనూరు, ఎర్రగుంట్ల మండలాల్లో ఆమె ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభల్లో షర్మిల మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి మళ్లీ అధికారంలో వస్తే ఆర్‌టిపిపిని మాయం చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో చంద్రబాబు, జగన్‌ అధికారంలో వచ్చినా ఇదే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. థర్మల్‌ ప్లాంట్‌లో ఉన్న రెండు వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తానని ఐదేళ్ల క్రితం జగన్‌ పాదయాత్రలో హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక అది మరిచిపోయారని పేర్కొన్నారు. ఇక్కడ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయని తెలిపారు. ఏడెనిమిది వేల రూపాయల జీతంతో బతుకుతున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల వారికి రెగ్యులర్‌ ఉద్యోగాలు ఇస్తూ ఇక్కడి వారిని మరిచిపోవడం ఎంత అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని వైఎస్‌ఆర్‌ అనుకున్నారని, ఆయన మరణం తర్వాత అది కాస్తా అటకెక్కిందని తెలిపారు. చంద్రబాబు ఒకసారి శంకుస్థాపన చేస్తే జగన్‌ రెండుసార్లు చేశారని పరిశ్రమ మాత్రం కార్యారూపం దాల్చలేదని విమర్శించారు. చంద్రబాబు, జగన్‌ ముఖ్యమంత్రులుగా ఉండి కనీసం రాజధాని కూడా కట్టలేకపోయారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా పదేళ్లు ఇస్తామని బిజెపి మోసం చేస్తే చంద్రబాబు, జగన్‌ మిన్నకుండిపోయారని తెలిపారు. న్యాయం కోసం సునీత తొక్కని గడప లేదన్నారు. తమ పక్కన న్యాయం ఆ పక్కన అధర్మం ఉందన్నారు. కడప ప్రజలు ఏ వైపు నిలబడతారో ఆలోచన చేయాలని అభ్యర్థించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకీ, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీకీ, రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో, దేశంలో ఇండియా వేదిక అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం వైఎస్‌ఆర్‌ జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్‌, జమ్మలమడుగు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పాముల బ్రహ్మానందరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర పరిశీలకులు ప్రసాద్‌, నాయకులు వెంకటస్వామి, మర్రిప్రకాశం, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బెల్లం మనోహర్‌, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్‌, సిపిఎం జమ్మలమడుగు పట్టణ కార్యదర్శి గోపాల్‌దాస్‌ యేసుదాసు పాల్గొన్నారు.

➡️