బిజెపితో టిడిపి, వైసిపి కుమ్మక్కు : వైఎస్ షర్మిల

Jan 24,2024 12:15 #BJP Govt, #Congress, #TDP, #YCP, #ys sharmila
sharmila comments on ycp tdp alliance with bjp

ప్రజాశక్తి-విశాఖపట్నం : బిజెపితో టిడిపి, వైసిపి కుమ్మక్కయ్యాయని ఏపీసిసి చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు.  విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. బిజెపితో చంద్రబాబు కనిపించే పొత్తులు, వైసీపీ కనిపించని పొత్తులు పెట్టుకుంటున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదాపై జగన్ ఎంపీలు ఇస్తే తెస్తా అన్నారని, అధికారంలో వచ్చిన వెంటనే మరిచిపోయారని అన్నారు. హోదా కోసం ఒక్కరోజు కూడా జగన్ ఉద్యమం చేసింది లేదని ఆగ్రహించారు. ఉత్తరాంధ్రను రెండు పార్టీలు మోసం చేశాయని తెలిపారు. ఇక్కడ ఉన్న కంపెనీలను ప్రైవేట్ కి అప్పనంగా అప్పగిస్తున్నారని మండిపడ్డారు. 30 ఏళ్ల లీజు తర్వాత గంగవరం పోర్ట్ ప్రభుత్వ పరం కావాల్సి ఉందని, కానీ దానిని చౌకగా అదానికి అమ్మేశారని ధ్వజమెత్తారు. నిబంధనలను తుంగలో తొక్కి ప్రభుత్వ వాటా 10 శాతంను చౌకగా అమ్మేశారని విమర్శించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడం ఒక కుట్ర అని తెలిపారు. ఇందిరమ్మ హయాంలో ఏర్పడిన విశాఖ స్టీల్ ను అమ్మే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ హయాంలో 3 మిలియన్ టన్నుల ఉత్పత్తిని 7 మిలియన్ టన్నుల ఉత్పత్తికి పెంచారని, ఇప్పుడు నష్టాల సాకు చూపి ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. 30 వేల మంది కార్మికులను రోడ్డున పడేస్తున్నారని ఆగ్రహించారు. విశాఖకి రైల్వే జోన్ ఇచ్చినా ఇంకా అమలు కాలేదని తెలిపారు. మెట్రో రైల్ ప్రాజెక్టు పత్తాకి లేదని పేర్కొన్నారు.  రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో రావాలని బీజేపీ తొత్తులుగా ఉన్న వైసిపి, టిడిపిలను ఓడించాలని కోరారు. బిజెపితో ప్రధాన పార్టీలు దోస్తీ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తామని తెలిపారు.

➡️