సిఎం జగన్‌తో షర్మిల భేటీ

-కుమారుడి పెళ్లికి రావాలని ఆహ్వానం

ప్రజాశక్తిఅమరావతి బ్యూరో :ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ఆయన సోదరి వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల భేటీ అయ్యారు. తన కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం, పెళ్లికి ఆహ్వానించేందుకు వైఎస్‌ షర్మిల తన భర్త అనిల్‌కుమార్‌, కుమారుడితో కలిసి బుధవారం సాయంత్రం తాడేపల్లికి చేరుకున్నారు. అంతకముందు ఇడుపులపాయ నుండి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న షర్మిల కుటుంబానికి ఇటీవల వైసిపికి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, పలువురు కాంగ్రెస్‌ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. సిఎం జగన్‌తో విభేదించి తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకున్న షర్మిల.. తెలంగాణ ఎన్నికలకు ముందు అభ్యర్థులను పోటీకి పెట్టకుండా భేషరుతుగా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆమె వైఎస్‌ఆర్‌టిపిని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్‌ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని, ఎఐసిసి జాతీయ ప్రధాన కార్యదర్శి లేదా పిసిసి అధ్యక్ష పదవిని చేపట్టబోతున్నట్లు రాజకీయంగా చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో వైసిపి 2024 ఎన్నికలకు 82 మంది సిట్టింగులను మారుస్తున్నట్లు వస్తున్న వార్తలతో వైసిపి టికెట్‌ దక్కని దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ తరపున పోటీ చేస్తే రాజకీయంగా వైసిపికి తీవ్రంగా నష్టం జరుగుతుందని ఆ పార్టీలో ఆందోళన నెలకొంది. షర్మిల గురువారం ఢిల్లీలో కాంగ్రెస్‌లో చేరేందుకు ముందురోజు అన్నను కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేసేందుకు తాడేపల్లికి రావడం చర్చనీయాంశమైంది. 2021 తర్వాత మొదటిసారి అన్నను కలిశారు. 30 నిమిషాలపాటు భేటీసిఎం జగన్‌ నివాసానికి వెళ్లిన వైఎస్‌ షర్మిల దంపతులు అన్నావదినలతో దాదాపు అరగంటపాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైఎస్‌ భారతికి, సిఎం జగన్‌కు స్వయంగా ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అరగంట భేటీలో కేవలం కుటుంబ విషయాలే చర్చించుకున్నట్లు తెలిసింది.

షర్మిల తర్వాత నేనూ కాంగ్రెస్‌లోకి : ఆళ్ల రామకృష్ణారెడ్డి

వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరిన తర్వాత తాను చేరుతున్నట్లు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుండి తాడేపల్లిలోని సిఎం నివాసానికి వైఎస్‌ షర్మిల కుటుంబంతోపాటు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా చేరుకున్నారు. అయితే అక్కడి సెక్యూరిటీ సిబ్బంది ఆళ్ల రామకృష్ణారెడ్డిని గేట్‌ బయటే నిలిపేయడంతో ఆయన బయటే ఉండిపోయారు. ఈ సందర్భంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ ఏ బాధ్యతలు ఇచ్చినా, ఇవ్వకపోయినా రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.

➡️