బిజెపికి వైసిపి, టిడిపి ఊడిగం : వైఎస్‌ షర్మిల

Apr 27,2024 12:00 #anakapalle district, #ys sharmila
  • వారిలో ఎవరికి అధికారం ఇచ్చినా మోడీకి గులాంగిరి చేస్తారు
  • ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించండి : వైఎస్‌ షర్మిల
  • ఆదివాసీలపై కుట్రలు చేస్తున్న వారిని ఓడించాలి: వి శ్రీనివాసరావు

ప్రజాశక్తి- పాడేరు, అరకులోయ విలేకరులు, అనకాపల్లి ప్రతినిధి : ప్రజావ్యతిరేక పాలన సాగిస్తోన్న బిజెపికి రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలైన వైసిపి, టిడిపిలు ఊడిగం చేస్తున్నాయని, జగన్‌, చంద్రబాబులు మోడీకి లొంగిపోయారని పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల విమర్శించారు. ఆమె చేపట్టిన ఎపి న్యారు యాత్రలో భాగంగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట, అల్లూరి జిల్లా పాడేరు, అరకులోయల్లో శనివారం బహిరంగ సభల్లో ఆమె ప్రసంగించారు. చంద్రబాబు, జగన్‌ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. ఆంధ్ర రాష్ట్రం పాలిట నియంతలుగా మారిన జగన్‌, చంద్రబాబులకు మళ్లీ అధికారం ఇస్తే మోడీకి గులాంగిరి చేస్తారని, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనలో వారు విఫలమయ్యారని వివరించారు. పక్క రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం ఎంతో వెనుకబడి ఉందన్నారు. జగన్‌ మూడు రాజధానులంటూ ఒక్క రాజధాని కూడా లేకుండా చేశారని వివరించారు. మద్యపాన నిషేధం అమలు చేయలేకపోయారని, దగా డిఎస్‌సితో యువతను మోసగించారని విమర్శించారు. చంద్రబాబు, జగన్‌ల పదేళ్ల పాలనలో పది కొత్త పరిశ్రమలైనా రాలేదన్నారు. మూతపడిన సుగర్‌ ఫ్యాక్టరీలను తెరిపించాలన్న ఇంగితం కూడా వారికి కరువైందని మండిపడ్డారు. ఇండియా వేదిక ప్రభుత్వం అధికారంలోకొస్తే గిరిజనులకు గృహ నిర్మాణాలు, ఉపాధి అవకాశాలు పెంపొందిస్తుందని హామీ ఇచ్చారు. గిరిజన హక్కుల సాధన, గిరిజనుల అభివృద్ధి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కృషి చేస్తుందన్నారు. ఆదివాసీ హక్కులను, రిజర్వేషన్లను నిర్వీర్యం చేస్తోన్న బిజెపి, వైసిపి, టిడిపిలను ఓడించాలని కోరారు. కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ, వామపక్షాలతోనే ప్రజా సంక్షేమం, ఆదివాసీల సంక్షేమం సాధ్యమన్నారు.

అడవిపై హక్కును తేల్చే ఎన్నికలివి : వి.శ్రీనివాసరావు
అడవిపై హక్కు అదానీదా? ఆదివాసీలదా? అన్నది ఈ ఎన్నికలు తేల్చబోతున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఆదివాసీలపై కుట్రలు చేస్తున్న వారిని ఓడించాలని కోరారు. హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల కోసం ఈ ప్రాంత అభివృద్ధిని అదానీకి తాకట్టు పెట్టి అటవీ భూములను అప్పగించి మోడీ ముందు మోకరిల్లిన వైసిపి ప్రభుత్వానికి, ఆ పార్టీ అభ్యర్థులకు ఆదివాసీలను ఓటు అడిగే హక్కులేదని తెలిపారు. ఈ ప్రాంతంలో జిఒ నెంబర్‌ 3 అమలు కాకుండా అడ్డం పడింది ఎవరో ఆదివాసీలకు ఎరుకేనని, గిరిజన యువత ఉద్యోగావకాశాలకు తూట్లు పొడిచింది ఎవరో తెలిసిందేనని అన్నారు. ఈ ప్రాంతానికి 588 ఉపాధ్యాయ ఉద్యోగాలు ప్రకటిస్తే అందులో గిరిజనులకు దక్కేవి 38 మాత్రమేనని, దీన్నిబట్టే వైసిపి ప్రభుత్వం గిరిజన యువతకు ఎంతటి అన్యాయం చేసిందో ఇట్టే అర్థమవుతుందని తెలిపారు. ఈ ప్రాంతంతో సంబంధంలేని వారిని ఇక్కడకు తీసుకొచ్చి గిరిజనుల్లో కలిపేసి ఎస్‌టి రిజర్వేషన్‌ను ఎత్తేసే కుట్ర చేసిన ఈ ప్రభుత్వాన్ని క్షమించరాదన్నారు. ఎటువంటి అభివృద్ధీలేక నేడు అరకులోయ అస్తవ్యస్తంగా మారిందని తెలిపారు. అడవిపై హక్కు ఆదివాసీలదేనని, ఆదివాసీల భవిష్యత్తు ఇండియా వేదికపై ఆధారపడి ఉందని అన్నారు. ప్రస్తుతం బిజెపికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని విధ్వంసం చేయడానికి మోడీ సర్కారు పూనుకుందని మిగతా 2లో విమర్శించారు. అరకు ప్రాంతంలో ఆర్‌ఎస్‌ఎస్‌ మకాం వేసి మరో మణిపూర్‌గా మార్చడానికి ప్రయత్నం చేస్తోందన్నారు. అరకు బిజెపి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అవినీతిలో కూరుకుపోయారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో బిజెపి కూటమిని, వైసిపిని ఓడించాలని కోరారు. సిపిఎం అరకు పార్లమెంట్‌ అభ్యర్థి పాచిపెంట అప్పలనర్స మాట్లాడుతూ 2004లో కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు కలిసి బిజెపిని తరిమికొట్టారని, ఇప్పుడూ అదే జరగనుందని అన్నారు.
ఆయా చోట్ల జరిగిన సభల్లో పాడేరు, అరకు, పాయకరావుపేట నియోజకవర్గాల కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థులు శతక బుల్లిబాబు, శెట్టి గంగాధర్‌స్వామి, బోని తాతారావు, కాంగ్రెస్‌ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి వేగి వెంకటేష్‌, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం, కిల్లో సురేంద్ర, అనంతగిరి జడ్‌పిటిసి దీసరి గంగరాజు, సిపిఐ అల్లూరి జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ, అనకాపల్లి జిల్లా కార్యదర్శి బి.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అరకులోయ, పాడేరు సభలకు పెద్ద సంఖ్యలో గిరిజనులు తరలివచ్చారు. గిరిజన కళాకారుల థింసా నృత్యం, ఇతర ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

➡️