చంద్రబాబుతో కలిసి షర్మిల కుట్రలు

  • మహిళా కమిషన్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి సిఎం జగన్‌మోహన్‌రెడ్డిపై వైఎస్‌ షర్మిల కుట్రలు చేస్తున్నారని, ఆమె పూర్తిగా చంద్రబాబు ఉచ్చులో చిక్కుకుపోయారని మహిళా కమిషన్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. తాడేపల్లిలోని వైసిపి కార్యాలయంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. షర్మిల ఏం రాజకీయం చేయాలనుకుంటున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. వైఎస్‌ పేరును ఛార్జ్‌షీట్‌లో చేర్చిన కాంగ్రెస్‌ పార్టీలో ఎందుకు చేరారని ప్రశ్నించారు. కోర్టు పరిధిలో ఉన్న వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యపై ఎలా మాట్లాడుతారన్నారు. ‘షర్మిల చాలా విషయాల్లో యూటర్న్‌ తీసుకున్నారు. ఆమె చేస్తున్న రాజకీయం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి తలవంపులు తెచ్చేలా ఉంది’ అని అన్నారు.

➡️