20న షర్మిల నామినేషన్‌

  • అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా పులివెందుల
  •  సునీత, తులసిరెడ్డి

ప్రజాశక్తి-పులివెందుల రూరల్‌ : కడపలో ఈ నెల 20వ తేదీన కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ అభ్యర్థిగా షర్మిల నామినేషన్‌ దాఖలు చేస్తారని వివేకా కుమార్తె డాక్టర్‌ వైఎస్‌ సునీత, పిసిసి మీడియా చైర్మన్‌ ఎన్‌ తులసిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. వివేకా చివరి కోరిక షర్మిలను ఎంపిగా చూడమేనని పేర్కొన్నారు. పులివెందులలోని వివేకా నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బుధవారం వారు మాట్లాడారు. పులివెందుల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని, విమర్శించారు. ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి హయంలోనే కడప జిల్లా అభివృద్ధి జరిగిందన్నారు. కడపకు రిమ్స్‌ మెడికల్‌ కళాశాల, యోగి వేమన యూనివర్సిటీ, ప్రాజెక్టు నిర్మాణలు, పులివెందుల సంబంధించి త్రిపుల్‌ఐటి, జెఎన్‌టియు కళాశాల, ఐజి కార్లు, నాలుగు రోడ్ల విస్తరణ వంటి ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని పేర్కొన్నారు. జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో ఆదరణ ఉందన్నారు. వైఎస్‌ఆర్‌ మరణించే రెండుమూడు రోజుల కిందట కూడా రాహుల్‌ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేవారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం దుష్టచతురాష్టత పాలన నడుస్తోందని, ఈ పాలనకు చరమగీతం పాడాలన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి పాలన అబద్ధాల పాలనని, రూ.మూడు లక్షల కోట్ల అప్పు భారాన్ని ఈ రోజు రాష్ట్రంపై ఉంచారని తెలిపారు. చుట్టుపక్కల రాష్ట్రాలలో ఎక్కడా లేని ధరలూ మన రాష్ట్రంలో ఉన్నాయని తెలిపారు. వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు, బిజెపికి వత్తాసు పలుకుతున్నాయని, ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేని స్థితిలో ఈ పార్టీలు ఉన్నాయని విమర్శించారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టాలని, రెండు మూడు రోజుల్లోనే పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు. త్వరలోనే ఇంటింటి ప్రచార కార్యక్రమమూ ప్రారంభమవుతుందన్నారు. సమావేశంలో నాయకులు ఎన్‌ శివప్రకాష్‌రెడ్డి, వేలూరు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

➡️