హేలాపురిలో వ్యూహాలకు పదును !

May 4,2024 03:30 #2024 election, #eleuru
  • ఢీ  అంటే ఢీ  అంటున్న వైసిపి, టిడిపి కూటమి
  • గట్టి పోటీనిస్తున్న ఇండియా బ్లాక్‌ అభ్యర్ధులు

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి : ఏలూరు జిల్లాలో ఎన్నికల సమరం రసవత్తరంగా కొనసాగుతోంది. ప్రధాన పార్టీలైన వైసిపి, టిడిపి-జనసేన-బిజెపి కూటమి, ఇండియా బ్లాక్‌ అభ్యర్ధులు వివిధ రూపాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే ఆయా పార్టీల రాష్ట్ర నేతలు, స్టార్‌ క్యాంపెయినర్లు ఒక విడత ప్రచారం గావించగా, వచ్చే వారంలో మరికొందరు నేతలు రానున్నారు. జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో…ఐదు నియోజక వర్గాల్లో సిట్టింగ్‌ ఎంఎల్‌ఎలకు వైసిపి సీట్లు ఇవ్వగా, పోలవరంలో సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు సతీమణి రాజ్యలక్ష్మిని, చింతలపూడి నుంచి రవాణాశాఖ అధికారిగా పని చేసిన విజయరాజును రంగంలోకి దింపింది. టిడిపి కూటమి తరపున ఉంగుటూరు, పోలవరంల్లో జనసేన, కైకలూరులో బిజెపి, ఏలూరు, నూజివీడు, దెందులూరు, చింతలపూడిల్లో టిడిపి అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ఏలూరు పార్లమెంట్‌ స్థానానికి 13 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వైసిపి, టిడిపి, కాంగ్రెస్‌ అభ్యర్థులతోపాటు వివిధ పార్టీల తరపున, ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. ఇక్కడ వైసిపి, టిడిపి బిసి- యాదవ సామాజిక తరగతికి చెందిన అభ్యర్థులను పోటీలోకి దింపాయి. ఇద్దరు ఆర్థికంగా సంపన్నులు కావడంతో పోటీ రసవత్తరంగా మారింది. నూజివీడులో టిడిపి కూటమి తరపున పోటీచేస్తున్న వైసిపి ఎమ్మెల్యే పార్ధసారధికి అసమ్మతి పోటు తగ్గింది. ఇక్కడ ఆ కూటమి తరపున టికెట్‌ ఆశించిన టిడిపి నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావు నామినేషన్‌ దాఖలు చేసి చివరి నిముషంలో ఉపసంహరించుకోవడంతో కూటమి నేతలు ఊపిరి పీల్చుకున్నారు.
జిల్లాలో ప్రధానంగా కొల్లేరు, పోలవరం నిర్వాసితుల సమస్య, ఆక్వా రైతుల ఇబ్బందులు, డెల్టా పరిధిలో తాగునీటి సమస్య, చింతలపూడి రైతులకు పరిహారం, కొల్లేరులో రెగ్యులేటర్ల నిర్మాణం, రోడ్లు వంటి అనేక సమస్యలు ఏళ్ల తరబడి కొనసాగుతున్నాయి. గత పదేళ్లలో టిడిపి ప్రభుత్వంగానీ, వైసిపి ప్రభుత్వంగానీ తమ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయలేదని ప్రజలు భావిస్తున్నారు.
2019 ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే కొల్లేరు ప్రజలకు న్యాయం చేస్తామని, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, సముద్రపు నీరు కొల్లేరులోకి ప్రవేశించకుండా రెగ్యులేటర్ల నిర్మాణం చేపడతామని, ఆక్వా రైతులను ఆదుకుంటామని, గోదావరి నుంచి పైప్‌లైన్‌ ద్వారా వాటర్‌గ్రిడ్‌ ఏర్పాటు చేసి తాగునీరు అందిస్తామని, చింతలపూడి ఎత్తిపోతల బాధిత రైతులకు న్యాయమైన పరిహారం ఇస్తామని, పోలవరం నిర్వాసితులకు పునరావాస ప్యాకేజి రూ.పదిలక్షలు ఇస్తామని, భూములకు అదనంగా రూ.ఐదు లక్షలు అందిస్తామని, ఏజెన్సీలో ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పిస్తామని అనేక హామీలను వైసిపి గుప్పించింది. అయితే ఏ ఒక్కటీ నెరవేర్చలేదు.
నియోజకవర్గాలవారీగా స్థానిక అంశాలు సైతం ప్రభావం చూపుతున్నాయి. ఓటర్లను ప్రలోభపెట్టి తమవైపు తిప్పుకునేందుకు వైసిపి, టిడిపి కూటమి అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వైసిపి అభ్యర్థులు చెపుతుండగా, పథకాల్లోని లోపాలను టిడిపి కూటమి అభ్యర్థులు తమ ప్రసంగాల్లో ప్రస్తావిస్తున్నారు. ఏ అంశాలు ఈ ఎన్నికల్లో ప్రభావితం చేస్తాయో వేచిచూడాల్సి ఉంది. పోలింగ్‌కు ఇక పదిరోజులు కూడా లేకపోవడంతో ప్రచారం ఉధృతమైంది. అభ్యర్థులు తమ వ్యూహాలకు మరింత పదును పెడుతూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు శతావిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయోననే విషయమై బెట్టింగ్‌లూ సాగుతున్నట్లు సమాచారం. వైసిపికి, బిజెపి-టిడిపి-జనసేన కూటమికి ఓటేయడానికి ఇష్టపడని వారు ఇండియా బ్లాక్‌ వైపు చూస్తున్నారు. దీంతో ఇండియా బ్లాక్‌ అభ్యర్థులు సైతం మెరుగైన ఓట్లు సాధించే పరిస్థితి ఉంది.

➡️