బస్సుల కొరత -ప్రజలకు తీవ్ర ఇక్కట్లు

May 14,2024 08:37 #Shortage of buses

– దూర ప్రాంత సర్వీసులూ లేవు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికలవేళ రాష్ట్రంలో ప్రయాణికులకు బస్సుల కొరత ఏర్పడింది. వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే, ఆర్‌టిసి అధికారులు ఆయా డిపోల్లో ఉన్న బస్సులను ఎన్నికల సామగ్రి, సిబ్బందిని తరలించేందుకు వినియోగించారు. ప్రతి డిపోలోనూ దాదాపు 90 శాతం బస్సులను వీటి కోసమే ఉపయోగించారు. దీంతో ఈ విషయం తెలియని ప్రయాణికులు బస్టాండ్‌లలో, రిక్వెస్ట్‌ స్టాప్‌లలో గంటల తరబడి వేచి చూశారు. బస్టాండ్‌లలో ఉన్న ఆర్‌టిసి అధికారులు బస్సులు లేవని, ఇప్పుడే రావని.. ఇతర ప్రత్యామ్నాయ మర్గాల ద్వారా గమ్యస్థానాలకు వెళ్లాలంటూ కనీసం ప్రకటన కూడా చేయలేదు. దీంతో ఆర్‌టిసి డిపో అధికారులతో ప్రయాణికులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో అనేక మంది ఇళ్లకు తిరుగుపయనమయ్యారు.

సమయానికి లేని దూర ప్రాంత సర్వీసులు
రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో ఈసారి లక్షలాది మంది ఉద్యోగులు, వ్యాపారస్తులు, ఇతర వర్గాల వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు తరలివచ్చారు. వీరంతా శుక్ర, శని, ఆదివారాల్లో ఇళ్లకు చేరుకున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ముంబయిలలో వివిధ ఉద్యోగాలు, ఉపాధి పనుల్లో నిమగమైన వీరంతా సొంతూళ్లకు క్యూ కట్టారు. అయితే సోమవారంతోనే వీరికి సెలవులు ముగియటం, ఇతరత్రా కారణాలతో ఓటు వేసిన వెంటనే.. వారు ఉద్యోగాలు చేసే ప్రదేశాలకు పయనమయ్యారు. వారి కోసం ఆర్‌టిసి అధికారులు ఎటువంటి స్పెషల్‌ సర్వీసులు వేయలేదు. ఉన్న సర్వీసులు కూడా సమయానికి రాలేదు. దీంతో విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖతోపాటు రాష్ట్రంలోని ప్రధాన బస్టాండ్లన్నీ దూర ప్రాంతాలకు వెళ్లే వారితో కిటకిటలాడిపోయాయి. మధ్యాహ్నం నుంచి సోమవారం రాత్రి వరకు వేచి ఉన్నా వీరికి బస్సులు దొరకలేదు. ఓవైపు లగేజీ, మరో వైపు గంటల తరబడి నిలబడటం తదితర కారణాలతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. ఆర్‌టిసి సర్వీసులు అనుకున్న సమయానికి రాకపోవటం, వచ్చినా వాటిలో సీట్లు లేకపోవటంతో చాలా మంది ప్రయాణికులు ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు, ట్యాక్సీలు, కార్లను ఎంచుకుని, వారికి అధిక మొత్తంలో చెల్లించి మరీ గమ్యస్థానాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

➡️