రాష్ట్రంలో చెదురుమదురు ఘర్షణలు – పలువురికి గాయాలు

May 13,2024 23:32 #many injured, #Sporadic clashes

ప్రజాశక్తి- యంత్రాంగం :రాష్ట్ర వ్యాపంగా సోమవారం జరిగిన ఎన్నికల ప్రక్రియలో పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. టిడిపి, వైసిపి నాయకులు,కార్యర్తలు బాహాబాహికి దిగడంతో పలువురికి గాయాలయ్యాయి. కర్నూలు వీకర్‌సెక్షన్‌ కాలనీలో దొంగ ఓట్లు వేయడానికి కొందరు ప్రయత్నించడంతో టిడిపి నాయకులు అడ్డుకున్నారు. దీంతో టిడిపి, వైసిపి నాయకుల మధ్య వాగ్వాదం చేటుచేసుకుంది. చివరికి దొంగ ఓటు వేయడానికి ప్రయత్నించిన ఐదుగురిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు.
ఎమ్మెల్యే చెంప పగులకొట్టిన ఓటర్‌
గుంటూరు జిల్లా తెనాలి రెండో వార్డు ఐతానగర్‌కు చెందిన ఓటరు గొట్టిముక్కల సుధాకర్‌ తన ఓటును వినియోగించుకునేందుకు ఎన్‌ఎస్‌ఎస్‌ఎం హైస్కూలులోని 115వ పోలింగ్‌ కేంద్రానికి వెళ్లారు. అదే సమయంలో ఓటు వేసేందుకు తెనాలి ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్‌, ఆయన సతీమణి, ఇరువురు కుమారులు వచ్చారు. క్యూలైన్‌ దాటుకుని ఎమ్మెల్యే పోలింగ్‌ బూత్‌లోకి వెళుతుండగా సుధాకర్‌ ప్రశ్నించారు. ఓటు వేసి బయటకు వస్తున్న ఎమ్మెల్యేను సుధాకర్‌ మరోసారి ప్రశ్నించారు. ఏంటిరా.. అంటూ సుధాకర్‌ చెంపపగులగొట్టారు ఎమ్మెల్యే. దీంతో ఓటరు తిరిగి ఎమ్మెల్యే చెంప చెళ్ళుమనిపించారు. సుధాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బాపట్ల జిల్లా, కర్లపాలెం మండలం ఏట్రావారిపాలెం గ్రామం లోని బూత్‌ నెంబర్‌ 134, 135లో రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు చీరాల గోవర్ధన్‌రెడ్డి ఓటర్లను ప్రలోభపెట్టే క్రమంలో వైసిపి నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. వైసిపి నాయకులు శ్రీనివాసరెడ్డికి, శేఖర్‌రెడ్డికి గాయాలయ్యాయి.

కోనసీమలో చెదురుమదురు ఘటనలు
అమలాపురం మండలం నడిపూడి గ్రామంలోని 13, 14 పోలింగ్‌ బూత్‌ల వద్ద టిడిపి, వైసిపి కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. వృద్ధులకు టిడిపి కార్యకర్తలు గుర్తులు చెబుతున్నారంటూ వైసిపి కార్యకర్తలు అడ్డుకోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. కాట్రేనికోన మండలం పల్లాంలో టిడిపి, వైసిపి కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. వైసిపికి చెందిన మల్లాడి చినధర్మారావు, మల్లాడి నరసింహ, మల్లాడి సతీష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. కుండలేశ్వరంలో వైసిపి, టిడిపి కార్యకర్తల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పోణంగిలో టిడిపి, వైసిపి గ్రూపుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వైసిపి కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలపై దాడి చేసి వేమురి నాగరాజు గొంతును కత్తితో కోయడంతో అతడిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కృష్ణా జిల్లాలో టిడిపి, వైసిపి బాహాబాహి
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై వైసిపి అభ్యర్థి వంశీ గ్రూపు దాడికి ప్రయత్నించారు. తేలప్రోలు జిల్లా పరిషత్‌ హైస్కూల్లో ఉన్న పోలింగ్‌ బూత్‌ను వెంకట్రావు పరిశీలించి బయటకు వస్తుండగా ఆయన కారుపై ఐదుగురు వ్యక్తులు దాడి చేశారు. విజయవాడ రూరల్‌ నున్న గ్రామం పోలింగ్‌ బూత్‌లో వైసిపి ఏజెంట్‌ ఓట్లు అడుగుతుండడంతో యార్లగడ్డ ప్రశ్నించారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే వంశీ అక్కడి వచ్చారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వెంకట్రావును సూరంపల్లి వైపుకు, వంశీని రామవరప్పాడు వైపుకు వెళ్లిపోవాలని చెప్పారు. సూరంపల్లి ఫ్లైఓవర్‌ వద్ద మళ్లీ రెండు గ్రూపులు బాహాబాహి తలపడ్డాయి. చెప్పులు, రాళ్లు విసురుకున్నారు.
విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలోని కర్ణవానిపాలెం సామాజిక భవనంలో వైసిపి, టిడిపి నాయకుల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం మోసయ్యపేట పోలింగ్‌ కేంద్రం వద్ద వైసిపి, టిడిపి నాయకుల మధ్య ఘర్షణ తలెత్తింది. చోడవరం మండలం గౌరీపట్నంలో టిడిపి, వైసిపి కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. అల్లూరి జిల్లాలోని రంపచోడవరం మండలం నర్సాపురం గ్రామంలో పోలింగ్‌ కేంద్రం వద్ద వైసిపి మహిళా కార్యకర్తకు, బిజెపి అరకు ఎంపి అభ్యర్థి కొత్తపల్లి గీతకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఫ్యాన్‌ గుర్తుతో ఉన్న సెల్‌ఫోన్‌ పౌచ్‌ను వైసిపి మహిళా కార్యకర్త ఉపయోగించడం పట్ల గీత అభ్యంతరం తెలిపారు.
పోలింగ్‌ ఆఫీసర్‌పై వైసిపి ఏజెంట్ల దాడి
విజయనగరం జిల్లా గజపతినగరం మండలం కొత్త శ్రీరంగరాజపురం పోలింగ్‌ కేంద్రం(100)లో పోలింగ్‌ ఆఫీసర్‌పై వైసిపి ఏజెంట్లు దాడి చేశారు. చూపు కనపడకపోవడంతో ఓ వృద్ధురాలు తనకు సహాయంగా మరొకరిని తీసుకువచ్చారు. పిఒ నిరాకరించారు. వైసిపికి ఓటు వేయాలని వృద్ధురాలు చెప్పినా పోలింగ్‌ అధికారి టిడిపికి ఓటు వేశారు. టిడిపికి ఓటు వేశారని ఆరోపిస్తూ వైసిపి ఏజెంట్లు ఆయనపై మూకుమ్మడిగా దాడి చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బత్స.అప్పలనరసయ్య పోలింగ్‌ బూత్‌ వద్దకు చేరుకుని పోలింగ్‌ నిలిపివేయాలని గొడవకు దిగడంతో రెండు గంటల పాటు పోలింగ్‌కు అంతరాయం కలిగింది.

➡️