వేతనాలివ్వకుంటే 3 నుంచి సమ్మె

Apr 27,2024 20:45 #muncipal workers, #strike

– మున్సిపల్‌ కార్మికుల నిరసన

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :నాలుగు నెలల పెండింగ్‌ వేతనాలు రెండో తేదీన చెల్లించకుంటే మూడో తేదీ నుంచి సమ్మెకు దిగుతామని మున్సిపల్‌ కార్మికులు హెచ్చరించారు. వేతన బకాయిల కోసం పల్నాడు జిల్లా నరసరావుపేట మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు), ఎఐటియుసి ఆధ్వర్వంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు షేక్‌ సిలార్‌ మసూద్‌ మాట్లాడుతూ.. ప్రతి నెల వేతనాలు చెల్లించకపోవడంతో వడ్డీ వ్యాపారులను కార్మికులు ఆశ్రయించాల్సి వస్తోందన్నారు. యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎ.సాల్మన్‌ మాట్లాడుతూ.. వార్డు కార్యదర్శుల కింద కార్మికులు పనిచేయాలనే నిబంధనను ఎత్తేయాలని, చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యుల పేర్లను ఆప్కాస్‌లో నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ ట్రాక్టర్‌ ఢకొీని ఇటీవల మృతి చెందిన డి.కోటయ్య కుటుంబానికి రూ.ఐదు లక్షల ప్రమాద బీమా, రెండు సెంట్ల స్థలం ఇస్తామన్న రాతపూర్వక హామీని సత్వరం నెరవేర్చాలని కోరారు. కొబ్బరినూనె, సబ్బులు, చెప్పులు, దుస్తులు, పనిముట్లు ఇవ్వడంతో పాటు ట్రాక్టర్లకు మరమ్మతులు చేయించాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ అందుబాటులో లేకపోవడంతో మేనేజర్‌కు వినతి పత్రం అందజేశారు. దీనిపై మున్సిపల్‌ అధికారులను ప్రజాశక్తి సంప్రదించగా బకాయి వేతనాలను ఒకటో తేదీన జమ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు టి.మల్లయ్య, డి.యోహన్‌, పి.దీనమ్మ, కార్మికులు పాల్గొన్నారు.

➡️