అమృతరావు స్ఫూర్తితో ‘ఉక్కు’ పరిరక్షణకు పోరాటం

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం పోరాటం చేసిన మహనీయుడు అమృతరావు స్ఫూర్తితో నేడు అదే కర్మాగారం పరిరక్షణకు పోరాటాలు నిర్వహిస్తున్నట్టు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో తలపెట్టిన రిలే దీక్షలు శనివారానికి 1171వ రోజుకు చేరాయి. దీక్షా శిబిరంలో అమృతరావు 35వ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన చిత్రపటం వద్ద ఘన నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ నాయకులు డి ఆదినారాయణ, వై మస్తానప్ప, డిసిహెచ్‌ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నాడు అమృతరావు స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు చేసిన పోరాటాన్ని గుర్తుచేశారు. త్యాగాలతో ఏర్పడ్డ ఈ కర్మాగారాన్ని నేటి పాలకులు అమ్మేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేయాలని అనుకోవడం దుర్మార్గమన్నారు. అమృత రావు వంటి మహనీయుల పోరాట స్ఫూర్తితో విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో నాయకులు బివి రమణమూర్తి, వరప్రసాద్‌, జగదీష్‌, చంద్రశేఖర్‌, డి శ్రీనివాస్‌, గుమ్మడి నరేంద్ర పాల్గొన్నారు.

➡️