అధ్యయనశీలి బృందాకరత్‌ : ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్‌ పుణ్యవతి

Mar 9,2024 10:32
  • బృందా జ్ఞాపకాలు ‘రీటా నేర్చిన పాఠం’ పుస్తకావిష్కరణ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మహిళా ఉద్యమకారిణి, ఐద్వా జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి బృందాకరత్‌ అధ్యయన శీలి అని ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్‌ పుణ్యవతి అన్నారు. అధ్యయనాన్ని ఆచరణలోకి తీసుకొచ్చి మహిళా సమస్యలపై పోరాటం చేశారని చెప్పారు. మహిళా దినోత్సవం సందర్భంగా బృందాకరత్‌ జ్ఞాపకాలు ‘రీటా నేర్చిన పాఠం’ పుస్తకాన్ని పుణ్యవతి శుక్రవారం ఆవిష్కరించారు. కరత్‌ ఉద్యమ నేపథ్యం, ఎంచుకున్న రాజకీయాల వైపు రావడానికి దారితీసిన పరిస్థితులను పుస్తకంలో పొందుపరిచారని తెలిపారు. విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో ఐద్వా, ప్రజాశక్తి బుకహేౌస్‌ ఆధ్వర్యాన ఈ కార్యక్రమం జరిగింది. పుస్తక రచయిత, అనువాదకురాలు కె ఉషారాణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పుణ్యవతి మాట్లాడుతూ.. పీడిత వర్గాలు తరపున, దోపిడీకి వ్యతిరేకంగా జరిగే పోరాటాల్లో స్త్రీల సమస్యలను ఎలా అంతర్భాగం చేయాలో ఈ పుస్తకం చదవడం ద్వారా అర్థమవుతాయని చెప్పారు. వియత్నాంపై అమెరికా చేసిన యుద్ధానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం అందించిన నాయకుల్లో బృందాకరత్‌ ఒకరని తెలిపారు. పెట్టుబడిదారీ వర్గంలో పుట్టినా కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితులయ్యారని చెప్పారు. పుచ్చలపల్లి సుందరయ్య సలహా మేరకు ఢిల్లీలోని కార్మికోద్యమంలో పనిచేశారని అన్నారు. దేశంలో విధించిన ఎమర్జెన్సీ సమయంలో టెక్స్‌టైల్‌ కార్మికుల కుటుంబంలో నివసించారని, ఆ సమయంలోనే మహిళలపై జరుగుతున్న గృహ హింస, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అర్థం చేసుకున్నారని చెప్పారు. వీటిని రాజకీయ అజెండాలో తీసుకొచ్చారని పేర్కొన్నారు. లైంగిక దాడి, హింస, మనోవర్తి, గృహ హింస వంటి అంశాలపై సుభాషిణి ఆలీ, సుశీల గోపాలన్‌, మైథిలి వంటి వారితో కలిసి పెద్దయెత్తున ఉద్యమాలు చేశారని వివరించారు. ఈ ఫలితంగా కొన్ని చట్టాల్లో మహిళలకు అనుకూలంగా మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. ప్రజా జీవితంలో, ఉద్యమాల్లో మహిళల పాత్ర లేకుండా ముందుకు వెళ్లలేమని బృందా అభిప్రాయపడ్డారని అన్నారు. మహిళోద్యమంలో తమకు సైద్ధాంతికంగా అనేక సలహాలు ఇచ్చారని తెలిపారు. ప్రజలతో ఉంటున్న అనుభవంతోపాటు సైద్ధాంతిక అవగాహన కూడా ఆమెకు ఉండటం వల్లే బృందా ఉద్యమాలు నడిపారని చెప్పారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి రమాదేవి మాట్లాడుతూ.. దేశ విప్లవోద్యమ రాజకీయాల్లో బృందా కీలక స్థానంలో ఉన్నారని చెప్పారు. ఆమె అనుభవాలను ప్రతిఒక్కరూ నేర్చుకోవాలన్నారు. ప్రస్తుతం దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ ఉందని, ఇలాంటి సమయంలో బృందా అనుభవాలు ఉపయోగపడతాయని చెప్పారు. ఐద్వా నాయకులు కె స్వరూపరాణి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మైక్రోఫైనాన్స్‌ సంస్థలు మహిళలకు రుణాలు పేరుతో వేధించిన సమయంలో సర్వే చేయాలని ఐద్వాలో ఉన్న తమకు బృందా చెప్పారని తెలిపారు. స్థానిక సమస్యలపై పోరాటం చేసే సమయంలో మహిళలను కలుపుకోవాలని సూచించారని చెప్పారు. పుస్తకంలో ఎక్కడా కూడా తాను అని బృందా ఉపయోగించలేదని, తాము అని చెప్పారని ఉషారాణి వివరించారు. ప్రజాశక్తి బుకహేౌస్‌ జనరల్‌ మేనేజర్‌ కె లక్ష్మయ్య వందన సమర్పణ చేసిన కార్యక్రమంలో ఎన్‌టిఆర్‌ జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు జహీదా ప్రసంగించారు.

➡️