అనుమానాస్పదంగా అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య – అనంతపురంలో తీవ్ర విషాదం

ప్రజాశక్తి – కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా : శెట్టూరు మండలం యాటకల్లు గ్రామంలో శుక్రవారం ఉదయం తీవ్ర విషాధ ఘటన చోటు చేసుకుంది. డిగ్రీ చదువుతున్న ఇద్దరు అక్కా చెల్లెళ్లు అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చాకలి సరస్వతి, నారాయణస్వామి దంపతులకు కుమారుడు మనోజ్‌, కుమార్తెలు రూప (20.) జ్యోతి (18) ఉన్నారు. గతంలో నారాయణస్వామి బెలుగుప్ప మండలం నరసాపురం గ్రామంలో నివసించేవారు. 20 ఏళ్ల క్రితం మొదటి భార్య మృతి చెందడంతో సరస్వతిని రెండో వివాహం చేసుకుని యాటకల్లు గ్రామంలో స్థిరపడ్డారు. కుమారుడు మనోజ్‌ మొదటి భార్య సంతానం కాగా, రూప, జ్యోతి రెండవ భార్య కుమార్తెలు. వీరిద్దరూ అనంతపురంలోని ప్రయివేటు హాస్టల్‌లో ఉంటూ శ్రీసాయి డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. గ్రామంలో జరిగే జాతర నిమిత్తం అక్కాచెల్లెళ్లు ఇద్దరూ 15 రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చారు. నారాయణస్వామి బంధువు గురువారం మృతి చెందడంతో భార్యతో కలిసి కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామానికి వెళ్లారు. గురువారం రాత్రి అక్కడే ఉండి శుక్రవారం ఉదయం తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. ఇంటికి వస్తున్న విషయాన్ని కుమార్తెలకు చెప్పేందుకు నారాయణస్వామి ఫోన్‌ చేశారు. వారు ఎంతసేపటికీ ఫోన్‌ తీయకపోవడంతో పక్కింటి వారికి ఫోన్‌ చేసి తమ కూతుళ్లకు ఫోన్‌ ఇవ్వాలని చెప్పారు. ఇంటి వద్దకు వెళ్లి పక్కంటి వారు చూడగా తలుపులు వేసి ఉండడాన్ని గమనించారు. అనుమానం వచ్చి తలుపులు తెరిచి చూశారు. అక్కచెల్లెళ్లు ఇద్దరూ వేర్వేరు గదుల్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. జ్యోతికి మూర్ఛవ్యాధి ఉన్నట్లు మృతిరాలి తల్లి చెబుతున్నారు. అనారోగ్య సమస్య వల్లనే వీరు ఆత్మహత్య చేసుకున్నారా? లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

➡️