అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోండి

Jan 20,2024 22:10 #left parties, #vinathi

-సిఎస్‌కు వినతిపత్రం అందించిన వామపక్షాలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించి సమ్మె విరమింపచేసేందుకు ప్రభుత్వం చొరవ ప్రదర్శించాలని వామపక్ష పార్టీలు కోరాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌ రెడ్డినిక్యాంపు కార్యాలయంలో ఆయా పార్టీల నాయకులు విజయవాడలో కలిసి శనివారం వినతిపత్రం అందజేశారు .న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నెల రోజులుపైగా అంగన్‌వాడీలు శాంతియుతంగా సమ్మె నిర్వహిస్తున్నారని గుర్తుచేశారు. సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం తరపున మంత్రులు, అధికారులు అంగన్‌వాడీ కార్మిక నాయకురాళ్ళతో చర్చలు జరిపినప్పటికీ ప్రభుత్వం సానుకూల వైఖరి ప్రదర్శించని కారణంగా ఒక కొలిక్కి రాలేదని వివరించారు. ప్రధానమైన వేతనాల పెంపును ప్రభుత్వం ఆమోదించాలని కోరారు. ప్రభుత్వం వారి సమస్యల పరిష్కారం కోసం నిర్దిష్టమైన హామీ ఇవ్వకుండా సమ్మె విరమింపచేయాలని ఒత్తిడి చేయడం భావ్యం కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 1.6లక్షల మంది ఆడపడుచులు అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లుగా పనిచేస్తున్నారని వివరించారు. వీరిలో అత్యంత వెనుకబడిన బడుగు, బలహీనవర్గాలకు చెందిన వారే అధికంగా ఉన్నారని తెలిపారు. సొంత ఆస్తులు లేక ప్రభుత్వం ఇచ్చే వేతనంపై ఆధారపడి ఎక్కువమంది జీవిస్తున్నారని వివరించారు. పెరుగుతున్న ధరలు, విద్య, వైద్యం ఖర్చులు భరించలేక వచ్చే జీతం చాలక అనేక అవస్థలు పడుతున్నారని వెల్లడించారు. ఖర్చుతో పోల్చుకుంటే వచ్చే వేతనం చాలా తక్కువగా ఉందని, వారికిచ్చే వేతనం పక్క రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటక, చివరికి చిన్న రాష్ట్రమైన పాండిచ్చేరి కంటే తక్కువగా ఉన్నాయన్నారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా వేతనాలు పెంచాలని రెండేళ్లుగా ప్రభుత్వాన్ని అంగన్‌వాడీలు కోరుతున్నారని వివరించారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో అనివార్యమై సమ్మెకు దిగారని తెలిపారు. పండుగలు, ఇంటిపనులు, పిల్లలను, వృద్ధులను ఇంటివద్ద వదిలి సామరస్యంగా ఆందోళనలు చేస్తున్నారని వెల్లడించారు. ఇటువంటి మహిళలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తున్నారని తెలిపారు. టెర్మినేషన్స్‌ వైపు ప్రభుత్వ చర్యలు ఉన్నట్లు తమ పార్టీల దృష్టికి వస్తున్నదని వివరించారు. ఇలాంటి చర్యలను విరమించి, ఆందోళన చేస్తున్న మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నాలుగు రోజులుగా ముఖ్యమైన నాయకులు నిరవధిక దీక్షలకు పూనుకొన్నారని, వీరి ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీల ద్వారా లబ్ధిపొందుతున్న తల్లిదండ్రులు, గర్భవతులు, ప్రజలు, చివరికి అధికార పార్టీ నాయకులు, శాసనసభ్యులు కూడా న్యాయమైన కోర్కెల పరిష్కారానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ మద్దతు తెలియజేస్తున్నారని వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం సంఘ నాయకులతో చర్చలు జరిపి న్యాయమైన కోర్కెల పరిష్కారానికి తగు చర్యలు తీసుకొని సమ్మె విరమింపజేయాలని, అంగన్‌వాడీ కార్మికులకు, లబ్ధి పొందుతున్న పేద కుటుంబాలు, గర్భవతులు, పిల్లలకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసిన వారిలో సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు వి శ్రీనివాసరావు, కె రామకృష్ణ, సిపిఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసి నాయకులు పి ప్రసాద్‌, సిపిఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ నాయకులు ఎన్‌ మూర్తి, శాసనమండలి పిడిఎఫ్‌ ఫ్లోర్‌ లీడర్‌ కెఎస్‌ లక్ష్మణరావు, సిపిఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు రామకృష్ణ, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఏంఎ గఫూర్‌, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, సిపిఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు రామకృష్ణ, సిపిఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ నాయకులు ఉదరు కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️