ఎన్నికల ఫలితాల అనంతరం హింస చెలరేగే అవకాశం – టిడిపి నేత రఘురామకృష్ణరాజు

May 22,2024 21:45 #press meet, #Raghuramakrishna Raju

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) :జూన్‌ నాలుగన వెలువడే ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో హింస చెలరేగే అవకాశం ఉందని, అందుకు వైసిపి నాయకులు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారని టిడిపి నాయకులు ఆర్‌.రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఎంవిపి కాలనీలోని టిడిపి నాయకులు గంటా శ్రీనివాసరావు క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాచర్లలో వైసిపి నాయకులు స్వయంగా ఇవిఎంను ధ్వంసం చేయడాన్ని ప్రసార మాధ్యమాల్లో చూస్తున్నామని, ఓటమి భయంతోనే ఇటువంటి దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని తక్షణమే తప్పించాలని డిమాండ్‌చేశారు. జూన్‌ తొమ్మిదిన చంద్రబాబునాయుడు మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని జోస్యం చెప్పారు. ఉద్యోగస్తుల వ్యతిరేకత ఉన్న ఏ పార్టీ కూడా ఎన్నికల్లో విజయం సాధించిన దాఖలాలు లేవన్నారు. ఎప్పుడో నాలుగు నెలల క్రితం బటన్‌ నొక్కిన రూ.14,000 కోట్ల సంక్షేమ పథకాల నిధులు ఎన్నికలకు ఒక్క రోజు ముందు జమచేసేందుకు కోర్టును ఆశ్రయించడం మోసపూరిత చర్య అన్నారు. ఈ ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమి 125 స్థానాలు గెలవాటం ఖాయమని చెప్పారు. విశాఖలో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సులో పాల్గన్న మహిళా పారిశ్రామికవేత్తలంతా ఐ-ప్యాక్‌ సభ్యులేనని ఆరోపించారు. 175కి 175 నెగ్గుతున్నామని బొత్స సత్యనారాయణ చెప్పడం హాస్యాస్పదమన్నారు. తాము అధికారంలోకి వస్తే చట్టబద్దంగా రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తామన్నారు. ఈ మీడియా సమావేశంలో బిజెపి నాయకులు విష్ణు కుమార్‌రాజు, టిడిపి నాయకులు గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌, కోరాడ రాజుబాబు పాల్గొన్నారు.

➡️