రాబోయే ఐదేళ్లలో విద్యుత్‌ ఛార్జీలు పెంచం

Jan 8,2024 08:03 #Chandrababu Naidu, #speech

-జగన్‌ పాలనలో రాష్ట్రానికి కోలులోలేని దెబ్బ

-రాజధాని అమరావతి వెలవెలా’రా… కదలి రా’ బహిరంగ సభల్లో చంద్రబాబు

ప్రజాశక్తి- తిరువూరు (ఎన్‌టిఆర్‌ జిల్లా), భీమవరం (పశ్చిమ గోదావరి జిల్లా) :వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తే రాబోయే ఐదేళ్లలో విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాను తీసుకొచ్చిన ఐటి రంగంతో, సైబర్‌బాద్‌ అభివృద్ధితో హైదరాబాద్‌ వెలుగుపోతుంటే నేడు జగన్‌ పాలనలో రాష్ట్ర రాజధాని అమరావతి వెలవెలబోతోందన్నారు. వైసిపి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయిందని, మళ్లీ కోలుకోలేని విధంగా రాష్ట్రాన్ని జగన్‌ దెబ్బతీశారని విమర్శించారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా కదలిరావాలని పిలుపునిచ్చారు. ఎన్‌టిఆర్‌ జిల్లా తిరువూరు, పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో ఆదివారం జరిగిన ‘రా… కదలి రా’ బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. మూడు రాజధానుల పేరుతో జగన్‌ మూడు ముక్కలాట ఆడారని, రుషికొండను బోడి గుండు చేసి రూ.500 కోట్లతో ప్యాలెస్‌ కట్టారని విమర్శించారు. ఓ పక్క హైదరాబాద్‌ వెలిగిపోతుంటే మరో పక్క అమరావతి వెలవెలబోతోందని, దీనికి కారణం జగన్‌ రివర్స్‌ పాలనని విమర్శించారు. ఓ వ్యక్తి వల్ల ఒక రాష్ట్రం, ఒక తరం ఇంతగా నష్టపోయిన పరిస్థితి దేశంలోనే కాదు ప్రపంచంలోనూ ఎక్కడా లేదన్నారు. ఈ రాష్ట్రంలో నాతో సహా అందరూ జగన్‌ బాధితులేనని వివరించారు. అరాచక పాలనకు చరమగీతం పాడాలని కోరారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖను మూసేశారని, ధాన్యం రైతులు దగా పడ్డారని, రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం రెండో స్థానంలో ఉందని విమర్శించారు. రైతుల బతుకులు బాగుపడాలంటే టిడిపి-జనసేన ప్రభుత్వం రావాలన్నారు. సంక్షేమ పథకాలకు నాంది పలికింది టిడిపి అని, జగన్‌ పాలనలో వంద పథకాలను రద్దు చేశారని వివరించారు. ఎమ్మెల్యేలను వేరే నియోజకవర్గాలకు బదిలీ చేసిన సందర్భాలు గతంలో లేవని, గుంటూరు ఎంపి టికెట్‌ పేరుతో అంబటి రాయుడును కూడా జగన్‌ మోసగించారని దుయ్యబట్టారు. గత నాలుగున్నరేళ్లలో బటన్‌ నొక్కానంటూ జనాలను మోసగించారని, పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాగేసుకున్నారని, విద్యుత్‌, ఆర్‌టిసి ఛార్జీలు ఇష్టానుసారం పెంచారని, పెట్రోలు, డీజిల్‌ ధరలు, నిత్యావసరాల ధరలు పెరిగినా చోద్యం చూస్తున్నారని విమర్శించారు. ఆక్వా రంగాన్ని వైసిపి ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టిందన్నారు. తాము అధికారంలోకి రాగానే జోన్లతో సంబంధం లేకుండా యూనిట్‌ విద్యుత్‌ రూ.1.20లకు అందిస్తామని హామీ ఇచ్చారు. పోలవరాన్ని పరుగులు పెట్టించి 72 శాతం పూర్తి చేశానని, వైసిపి వచ్చాక పోలవరాన్ని గోదాట్లో కలిపిందని విమర్శించారు. పోలవరాన్ని పూర్తి చేసి నదుల అనుసంధానంతో మూడు పంటలకు సాగు నీరందిస్తామన్నారు. జగనన్న ఎక్కుపెట్టిన బాణం షర్మిల ఇప్పుడు జగన్‌పైకే వస్తోందని ఎద్దేవా చేశారు. బిసిలు టిడిపికి వెన్నెముకని, బిసిల సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతామని హామీ ఇచ్చారు. ఎస్‌సి, ఎస్‌టిలకు, మైనార్టీలకు వైసిపి ప్రభుత్వం మోసగించిందని విమర్శించారు. కాపులకూ తీవ్ర అన్యాయం చేసిందని, రిజర్వేషన్లను సైతం అడ్డుకుందని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఆక్వా యూనివర్సిటీ, మెడికల్‌ కళాశాల, ఫిషింగ్‌ హార్బర్‌లను అధికారంలోకి రాగానే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

➡️