మిమ్స్‌ ఆందోళనలో పది మంది అరెస్టు – ఏడుగురికి రిమాండ్‌

– అరెస్టయిన వారిలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ, సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని
ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి, నెల్లిమర్ల :సమస్యలు పరిష్కరించాలని 67 రోజులుగా నిరసన చేస్తున్న మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు, సిఐటియు నాయకులపై మిమ్స్‌ యాజమాన్యం పోలీసులను ఉపయోగించి నిర్బంధానికి, అరెస్టులకు పాల్పడుతోంది. శనివారానికి 16 మంది సిఐటియు నాయకులను, మిమ్స్‌ ఉద్యోగులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు.. తాజాగా ఆదివారం మరో పది మందిని అరెస్టు చేశారు. వారిలో ఏడుగురిని రిమాండ్‌ చేశారు.
విజయనగరం జిల్లా నెల్లిమర్లలో సిఐటియు మద్దతుతో మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు 67 రోజులుగా సమ్మె చేస్తున్నారు. సమ్మె శిబిరాన్ని సందర్శించేందుకు ఆదివారం సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ, జిల్లా కార్యదర్శి వి.లక్ష్మి, సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ వచ్చారు. అక్కడ నాయకులను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసుల చర్యకు వ్యతిరేకంగా సుబ్బరావమ్మ రహదారికి అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు. పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి, డెంకాడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం శిబిరం వద్ద ఉన్న ఉద్యోగులు విసినిగిరి అప్పలనాయుడు, మహంతి నాగభూషణరావు, గొండెల రమణమూర్తి, రాంబార్కి రమణ, బెల్లాన రాజాబాబు, పతివాడ శ్రీను, కొసర లక్ష్మి.. మొత్తం ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దీంతో రిమాండ్‌కు తరలించిన వారి సంఖ్య 23కు చేరింది. అరెస్టయిన సుబ్బరావమ్మ, తమ్మినేని, లక్ష్మిని సాయంత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా సుబ్బరావమ్మ మాట్లాడుతూ అక్రమ కేసులను రద్దు చేసి, అరెస్ట్‌ చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. యాజమాన్యం, ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

➡️